Tuesday, 3 November 2026

నకిలీ పోలీసుల ముఠా అరెస్టు 

హైదరాబాద్‌, సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  పోలీసుల వేషధారణలో హైవే పోలీసులమంటూ వాహన దారులను బెదిరించి లంచాలు వసూలు చేస్తున్న ఘట్‌కేసర్‌ పరిధిలో ఒక ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(సీపీ) మహేష్‌ భగవత్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. హైవేపై వాహనదారులను ఆపి, వారి నుంచి భారీగా డబ్బు దోచుకుంటున్నారని కమిషనర్‌ తెలిపారు. డబ్బులు లేని వారి దగ్గర బంగారు నగలు కూడా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ముఠాలో ఐదుగురు సభ్యులు ఉన్నారు.
పోలీసుల గెటప్‌లో వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ, పోలీసు వృత్తిని చెడు పనులకు వాడుకుంటున్నారని ఆయన తెలిపారు. వారినుంచి 42.65 తులాల బంగారం, 3 లక్షల 51 వేల రూపాయలు, 1800 యూ ఎస్‌ డాలర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన విూడియాకు తెలిపారు. అలాగే నిందితుల నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.