హైదరాబాద్, సెప్టెంబర్24 జనం సాక్షి : హుజూర్‌నగర్ ఉప ఎన్నిక రాజకీయ పార్టీలలో చిచ్చు రేపుతోంది. ఒక్క టిఆర్‌ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ కూడా గందరగోళానికి గురవుతున్నాయి. ఎన్నికల కమిషన్ తన విలేకరుల సమావేశాన్ని పూర్తి చేసే లోపలే టీఆర్‌ఎస్ తన అభ్యర్ధిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అభ్యర్ధి ఎంపిక నేతల మధ్య అగ్గి రాజేసింది. అధికారం కోసం తహతహలాడుతున్న బిజెపికి మాత్రం అభ్యర్ధులు దొరక్కపోవడం విచారకరం.
కాగా, మంగళవారం సమావేశమైన పార్టీ కోర్ కమిటీలో బీజేపీ తరపున అభ్యర్థిగా శ్రీకళారెడ్డి దాదాపుగా ఖరారు చేసింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచనతో శ్రీకళారెడ్డిని రాష్ట్ర బీజేపీ కార్యవర్గం ఎంపిక చేసినట్లు తెలిసింది. కోదాడ మాజీ ఎమ్మెల్యే జితేందర్‌రెడ్డి కుమార్తె అయిన శ్రీకళారెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేయనున్నారు.
తొలుత, ఉద్యమంలో మరణించిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను అభ్యర్ధిగా ఎంపిక చేయాలనుకున్న బిజెపికి ఆమె షాక్ ఇచ్చారు. శంకరమ్మను పోటీలో నిలబెట్టి టీఆర్‌ఎస్ ను ఇరుకున పెట్టాలని బీజేపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బీజేపీ ఎత్తులు ముందే గమనించిన గులాబీ నేతలు శంకరమ్మను బుజ్జగించి భవిష్యత్ పై భరోసా కల్పించడంతో శంకరమ్మ గులాబీకి జై కొట్టింది. దాంతో శంకరమ్మకు టీఆర్‌ఎస్ నామినేటెడ్ పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
హుజూర్‌నగర్ అభ్యర్ధిగా శ్రీకళారెడ్డి?




