ఆదిలాబాద్,జూన్2(జనం సాక్షి): సామాన్యులు అవస్థలు పడుతున్నా నగదురహిత పాలన అంటూ ప్రధాని మోడీ ఆయన వందిమాగధులు ఊదరగొడుతున్నారని సిపిఎం మండిపడింది. రోడ్డుపక్కన బండ్లపైకొనుగోళ్లకు కార్డు పనిచేస్తుందా అని సిపిఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి ప్రశ్నించారు. తలాతోక లేని నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందుల పాలుచేయడం తగదన్నారు. వెంటనే బ్యాంకులకు చిన్ననోట్లను సరఫరా చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నల్లధనంపై ప్రధాన మంత్రి మోదీ చేస్తున్నది నకిలీ యుద్ధమని, తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు నోట్లను రద్దు చేశారని సీపీఎం నేత ఆరోపించారు. అధికారంలోకి వస్తే వంద రోజులలో విదేశాలలో ఉన్న రూ.75 లక్షల కోట్ల నల్లధనాన్ని రప్పించి ప్రతి కుటుంబానికి పంచుతానని ప్రగల్భాలు పలికిన మోదీ పైసా కూడా తేలేకపోయారన్నారు.




