ఒక్క మహిళకు కూడా కెసిఆర్ కేబినేట్‌లో చోటు లేదు
70లక్షల మంది మహిళా సంఘాల వారికి తీరని అన్యాయం
మహిళా సదస్సులో ఉత్తమ్ ఆరోపణలు
హైదరాబాద్,ఆగస్ట్13(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో.. కేసీఆర్ పాలనలో నాలుగన్నరేళ్లుగా మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం క్లాసిక్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా కేబినెట్‌లో ఒక్క మంత్రి కూడా లేరని విమర్శించారు. శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకుల లలిత ఉన్నారని… కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేబినెట్‌లోకి ఒక్క మహిళ మంత్రిని కూడా తీసుకోలేదని, అలాగే రాష్ట్రంలో ఉన్న మహిళ సంఘాల్లో 70 లక్షల మందికి కేసీఆర్ ద్వారా అన్యాయం జరుగుతుందని ఆయన విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ మహిళ సంఘాలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఈ మహిళ శక్తి ద్వారా కేసీఆర్, ఆయన కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. ఆరులక్షల మహిళా సంఘాలు,
70 లక్షల మంది సభ్యుల అభయ హస్తం పెన్షన్ స్కీమ్, బ్యాంక్ రుణాలపై వడ్డీ ప్రభుత్వం భరించే జీవోగానీ సీఎం కేసీఆర్ పాటించడంలేదని ఉత్తమ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, మహిళ సంఘాలకు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ అమలు చేస్తుందని ఆయన హావిూ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మహిళ సంఘాలకు ప్రతి సంఘానికి రూ. లక్ష గ్రాంట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ఆయన సభా వేధికగా రాహుల్ సమక్షంలో హావిూ ఇచ్చారు. ప్రతి సంఘానికి బ్యాంకుల నుంచి రూ. 10 లక్షల రుణం ఇప్పించి… ఆ వడ్డీని కాంగ్రెస్ ప్రభుత్వమే కడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అభయ హస్తం పతకాన్ని తిరిగి పునరుద్దరిస్తామని చెప్పారు. పెన్షన్ కూడా రూ. 1000కి పైగా ఉంటుందని, ఇన్పురెన్స్ బీమా ప్రతి మహిళకు రూ. 5లక్షలకు చేయిస్తామని, బీమా మిత్రా, విలేజ్ అర్గనైజేషన్ అసిస్టెంట్‌లకు రూ. 7500 వేతంగా ఇస్తామని ఆయన ప్రకటించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని ఉత్తమ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జైపాల్ రెడ్డికి అనుమతి నిరాకరణ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సీనియర్ నేత అయిన జైపాల్ రెడ్డిని సెక్యురిటీ సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతించలేదు. రాహుల్‌కు స్వాగతం పలికేందుకు పోలీసులు 10 మందికి మాత్రమే అనుమతిచ్చారు. ఈ జాబితాలో తెలంగాణ పీసీసీ జైపాల్ రెడ్డి పేరు పేర్కొనలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో హౌజ్ టెర్మినల్ వద్దే జైపాల్ రెడ్డి వేచి చూడాల్సి వచ్చింది. ఆయనతో పాటు పోన్నాల లక్ష్మయ్య, మర్రిశశిధర్ రెడ్డి, వీహెచ్, జీవన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డిలు బయటే ఉన్నారు. వీవీఐపీ టెర్మినల్‌కు 2 కిలోవిూటర్ల దూరం వరకే పోలీసులు కాంగ్రెస్ నేతలకు అనుమతినిచ్చారు. రాహుల్ పర్యటన సందర్భంగా శంషాబాద్‌కు 500 బైక్‌లతో ర్యాలీ వెళ్లాలనుకున్న పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పట్టించుకోని కార్యకర్తలు బైక్ ర్యాలీ తీసే ప్రయత్నం చేశారు. దీంతో భారీగా ట్రాఫీక్ జామ్ అయింది.




