రూ.4లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు
– అవినీతిని ఆధారాలతో నిరూపించాం
– ఇప్పటి వరకు ఏ కోర్టు కూడా జగన్‌ను దోషి అని చెప్పలేదు
– కాంగ్రెస్ బనాయించిన తప్పుడు కేసులు పట్టుకొని జగన్‌పై విమర్శలు చేస్తున్నారు
– విలేకరుల సమావేశంలో వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్
హైదరాబాద్, జులై27(జనం సాక్షి) : గత నాలుగేళ్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.4 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నది ఆధారాలతో సహా నిరూపించామని వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సంఘమే చంద్రబాబు అతి ధనవంతుడైన రాజకీయ నాయకుడని ప్రకటించిందని.. మరి రెండెకరాలున్న చంద్రబాబు అత్యంత ధనవంతుడైనా రాజకీయ నేతగా ఎలా ఎదిగాడో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వేలు, స్టడీలన్నీ చంద్రబాబు అవినీతిపరుడని చెబుతున్నాయని వరప్రసాద్ అన్నారు. ఇంతవరకూ ఏ కోర్టు కూడా వైఎస్ జగన్‌ను దోషి అని చెప్పలేదన్నారు. కాంగ్రెస్ బనాయించిన తప్పుడు కేసులు పట్టుకుని జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలను వల్లించినట్టు ఉందని వరప్రసాద్ పేర్కొన్నారు. బాబు ఆస్తులపై విచారణ జరిపించాలని కేసులు వేసినప్పుడు స్టేలు తెచ్చుకుంటున్నారంటే ఆయన అవినీతిపరుడని తేలిపోయిందన్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో స్పష్టంగా చెప్పడంలోనూ చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇంకా టీడీపీ – బీజేపీల మైత్రి కోనసాగుతోందని ఆరోపించారు. జీబీఎల్, కన్నా లక్ష్మీనారాయణ, రామ్ మాధవ్… ఇలా అందరూ చంద్రబాబు అవినీతిపరుడని చెబుతున్నా… మరి ఆయనపై బీజేపీ ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఏపీ సీఎం అవినీతిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
—————————————–




