జూలైలో పెద్ద ఎత్తున మళ్లీ మొక్కలు నాటే యజ్ఞం
అందరూ పాల్గొనాలని సిఎం కెసిఆర్ పిలుపు
ప్లాస్టిక్ వినినయోగం వద్దని హితవు
హైదరాబాద్,జూన్5(జనం సాక్షి ): నాలుగో విడత హరితహారం కోసం తెలంగాణ ప్రభుత్వం సిద్దమువతోంది. గత మూడు దశల కార్యక్రమాల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. జూలైలో నాలుగో విడత కోసం ప్రణాళిక ఖరారు చేశారు. ఆకుపచ్చ తెలంగాణ సాధించేందుకు సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేస్తున్నారు. ఇప్పటికే మూడుదశల్లో తెలంగాణకు హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఊరూరా చేపట్టిన హరితయజ్ఞానికి మంచి స్పందన లభించింది. త్వరలోనే నాలుగో విడత హరితహారాన్ని కూడా చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చదనం ప్రాముఖ్యతను సీఎం కేసీఆర్ అందరికీ వివరించారు. ఈ సందర్భంగా పర్యావరణ ప్రేమికులందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే హరితహారం విజయవంతం అవుతుందన్న సీఎం కేసీఆర్, జులైలో మొదలయ్యే నాలుగో విడత హరితహారంలో అందరూ పాల్గొనటంతో పాటు, నాటిన ప్రతీ మొక్కా బతికేలా రక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపు నిచ్చారు. పచ్చని పర్యావరణం కోసం హరితహారంలో భాగంగా అర్బన్ ఫారెస్ట్ పార్కులు, రహదారి వనాలు (ఎవెన్యూ ఎ/-లాంటేషన్) ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు దశల వారీగా ఎలక్టిక్రల్ వాహనాలును ప్రవేశ పెట్టబోతున్నామని చెప్పారు. ఇప్పటికే సౌర విద్యుత్ లో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అటవీ పునరుజ్జీవన చర్యలు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.సమస్త సంపదల కంటే ఆరోగ్య సంపదే అత్యంత ప్రాధాన్యమైందన్నారు సీఎం కేసీఆర్. భవిష్యత్ తరాలకు ఆరోగ్యంగా పెరిగే వాతావరణాన్ని సమకూర్చడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అందులో భాగమే ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న తెలంగాణాకు హరితహారం కార్యక్రమమన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రాధాన్యతను వివరించారు. పర్యావరణ పరంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గుర్తు చేసుకున్నారు. పర్యావరణపరంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల ప్రభావం మనపై కూడా ఉంటుందన్నారు. వాటి విషయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వీలైనంతగా కాలుష్య కారకాలను వాడకపోవడం పైన అందరూ దృష్టి పెట్టాలన్నారు. ఈ యేడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్లాస్లిక్ వినియోగం, పొంచి ఉన్న ముప్పును ప్రధానంగాప్రచారం చేస్తోందన్నారు. నిత్య జీవితంలో ప్లాస్టిక్ ఎంతగా అవసరం ఉన్నా, దాని వల్ల ముప్పను అరికట్టలేమన్నారు. పచ్చదనం, పరిశుభ్రత ప్రాధాన్యతలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, అందుకే తెలంగాణకు హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టిందన్నారు. ప్రజలందరికీ కాలుష్య రహిత వాతావరణం, స్వచ్ఛమైన నీరు, ఆహారం అందించే కర్తవ్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. గత మూడేళ్ల ఫలితాలు స్పష్టంగా కనిసిస్తున్నాయని తెలిపారు. మొక్కల పెంపకం, వాటి రక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి పెంచినప్పుడే ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉంటాయన్నారు. ప్రస్తతం ఉన్న వాటికి తోడు, రానున్న తరాలకు అవసరమయ్యే విధంగా మనం చెట్లు పెంచుతున్నామనే ఆలోచన ప్రతీ ఒక్కరిలో రావాలన్నారు.




