Monday, 2 November 2026

నినదించిన తెలంగాణ సాహితీ గొంతుక

హైదరాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషలో తెలుగు లేదంటూ ఇంతకాలం నిర్లక్ష్యంగా మాట్లాడిన చోటే  తెలంగాణ తెలుగే అసలు తెలుగనే విషయాన్ని ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా చాటాయి. తెలుగు మహాసభలను జరుపుకోవడం తెలంగాణ ప్రజలకే కాకుండా తెలుగు ప్రజలందరికి గర్వ కారణంగా ఈ సభలు నిలిచేలా చేశారు. ఈ సభల పుణ్యమా అని తెలంగాణ భాష, తెలంగాణ యాస తలెత్తుకుని నిలిచేలా నినదించారు. తెలంగాణ భాషా వైదుష్యాన్ని చాటారు. ఇంతకాలం అణచివేతకు గురైన వారు గర్వంగా తెలంగాణ యాసలో మాట్లాడారు. జనభాషే తెలంగాణ భాష అని నిరూపించడానికి ఈ సభలు వేదికగా మారాయి. అలాగే ఎందరో కళాకారులు, కవులు తమ ప్రతిభను చాటారు. తెలంగాణ యాసను గర్వంగా ప్రకటించారు. తెలంగాణ తెలుగు మాధుర్యాన్ని చాటారు. ఆనాటి కవులు, కళాకారులను యాది చేసుకున్నారు. తెలుగు భాష సుభిక్షంగా ఉందంటే ప్రజల నోళ్లలో నానుతుండడం వల్లనే అని గుర్తించాలి. ప్రజల నోట్లో భాష ఎప్పుడూ నాట్యమాడుతుంది. అందుకే మాండలికం అన్నది ప్రాంతాలను బట్టి ఉంటుంది. ఫలానా మాండలికం తప్పని ఎవరైనా అంటే వారు పిచ్చివాళ్లు అనుకోవాలి. అందుకే తెలంగాణ మాండలికాన్ని తప్పుపట్టిన వారు తెలంగాణ ఉద్యమంలో తుక్కులా కొట్టుకుపోయారు. గ్రావిూణ ప్రజలు ఇంకా తెలుగు భాషపట్ల ఆకర్షితులవుతూ, భాషను ప్రేమించడం వల్లనే ఇంకా తెలుగు భాష సజీవంగా ఉంది. తెలుగు భాషకు చావు లేదని,  మరో
వెయ్యేళ్ళయినా ఇది  వర్ధిల్లుతుందని ధీమాగా ఉన్నారు. తెలుగువారంతా తెలుగు మహాసభల విజయానికి కృషి చేయడంతో  ఇది మరోమారు స్పష్టం అయ్యింది. గతంలో రచయితలూ, కవుల కోసమే  తెలుగు మహాసభలు అనుకొనే వారు. కానీ తెలుగు వారందరికీ ఈ సభలు అన్నది రుజువు చేశారు. మరో వైపు తెలంగాణలోని వివిధ కళల కళాకారులు తమ ప్రాభవాన్ని ఇక్కడ చాటాయి. ప్రచురణ, ముద్రణ లేని కాలంలో భాష అన్నది నాటకాలు, పద్యాలు, జనపదాల రూపంలో సాగుతూ వచ్చింది. వేదాలు అందుకే అపౌరుషేయాలు అన్నారు. అంటే వేదాన్ని వల్లెవేయడం ద్వారా కాపాడుతూ వచ్చారు. సామాన్యులకు సైతం అర్థం అయ్యే రీతిలో సాహిత్య, భాషా సేవ అందుబాఇటులోకి రావాలి. తెలుగు భాష సొగసులు, లయలోని మాధుర్యం మరే ప్రపంచ భాషకు లేదనే విషయాన్ని మరోమారు చాటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత మొదటిసారిగా తెలంగాణ కవులు, రచయితలు, ఇతర సాహిత్యకారులు సగర్వంగా తమ భాషా వైదుష్యాన్ని చాటాలరు. ఉద్యమకారుడు అయిన కేసీఆర్‌ తనలోని సాహిత్యకారుడిని, రచయితను తెలంగాణ ఉద్యమం ద్వారానే బయటపెట్టారు. సాహితీవేత్తలకు తీసిపోని విధంగా కేసీఆర్‌  భాషా పాటవం కలిగి ఉన్నారు. ఆయన తన ఉపన్యాసాల్లో తెలంగాణ తెలుగు మాండలీకం తొణికిసలాడించారు. తెలంగాణ యాసలో ఆయన మాట్లాడిన వేలాది సభల్లో తెలుగు మాధుర్యాన్ని చూపారు.  తెలంగాణ భాషకు, యాసకు సాహితీ గౌరవాన్ని కల్పించడంలో కేసీఆర్‌ పాత్ర ఏంతో ఉంది. కేసీఆర్‌కు ముందు ఎంతో మంది తెలంగాణ భాష, యాసతో రచనలు చేసినా అవి ఒక ప్రాంత మాడలీకం అనీ, ఆ భాష అన్ని ప్రాంతాలవారికీ అక్కరకు రానిదని కొట్టి పారేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నాటి నుంచి అనేకమంది కవులు, రచయితలు ఎంతోమంది తెలుగు సాహిత్యాన్ని తమ రచనలతో సుసంపన్నం చేసారు. ఎంతోమంది తెలుగులో వివిధ పక్రియలలో రచనలు చేసి మహా మేధావులు, పండితులమనుకొనే వారికి దీటుగా నిలిచారు.  గద్య పక్రియలైన కథ, నవలా రచనల్లో సామాన్యుల జీవితాలను కళ్ళకు కట్టినట్లు రాసిన ప్రముఖ రచయిత లందరూ తెలంగాణవారే. అయితే ఉమ్మడి పాలనలో  ఆనాటి పరిస్థితుల్లో తెలంగాణ రచయితలకు అంతగా గుర్తింపు దొరకలేదు. అంతేగాకుండా ఇక్కడివారికి ఆనాటి ఆంధ్ర సాహిత్యకారులు తగిన గౌరవం ఇవ్వలేదు. దాశరధి, వట్టికోట, సుద్దాల హనుమంతు, కాళోజీల కాలం నుంచి నేటి గూడ అంజయ్య, గద్దర్‌, గోరటి వెంకన్న, జూలూరు గౌరీశంకర్‌లాంటి ప్రజా కవులు, గాయకులు కూడా ఆ రోజుల్లో తగిన సాహిత్య గౌరవాన్ని పొందలేకపోయారు. ప్రచురణ రంగం ఆంధ్రుల చేతుల్లోనే ఉండటం, ఇక్కడి వారికి ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల తెలంగాణ రచయితల, కవుల రచనలకు తగినంత సాహిత్య గౌరవం దక్కలేదని చెప్పాలి. సురవరం ప్రతాపరెడ్డి నుంచి మొన్నటి జ్ఞానపీఠ అవార్డ్‌ గ్రహిత సినారె వరకు తెలంగాణ రచయితల గొప్పదనం గురించి ఏనాడూ మాట్లాడుకోలేదు. సినిమా కవి కాబట్ట సినారె గురించి ముచ్చిటించుకున్నా ఆయన స్థాయిలో జరగలేదు. తెలంగాణ ప్రజాఉద్యమంలో వచ్చినంతమంది కవులు, రచయితలు, గాయకులు, ఇతర కళాకారులు మరే ఉద్యమంలో బయటకు రాలేదు. తెలంగాణలో మౌఖిక సాహిత్యానిదే పైచేయి. ఎంతోమంది గ్రావిూణ నిరక్షరాస్యుల వేలాది పాటలు, పద్యాలు పాడారు. అవన్నీ సేకరణకు, ప్రచురణకు నోచుకోలేదు. జానపద సాహిత్యానికి, పరిశోధనకు తగిన నిధులు లేవంటూ వాటిని నాటి పాలకుల నిరల్‌క్ష్యం చేశారు. జానపద సాహిత్యాన్ని సేకరించి, పరిష్కరించి, ప్రచురించడానికి బిరుదురాజు రామరాజు లాంటి వారు కృషి మొదలు పెట్టిన తరవాతనే తెలంగాణ జానపదాలకు ప్రాశస్త్యం వచ్చింది. కానీ ఇప్పుడా భయం అక్కర్లేదు. తెలంగాణలో మాధుర్యం ఉన్న మాండలికాలు ఉన్నాయి. పల్లెపదాలు ఉన్నాయి. పాటలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు జనం నోట నాట్యమాడుతున్నాయి. అలాంటి రచయితలు
ఇప్పడు గొంతెత్తి పాడుతున్నారు. మాట్లాడుతున్నారు. అదే తెలంగాణ విజయంగా చెప్పుకోవాలి.
—–