Tuesday, 3 November 2026

నిబంధనలు ఎవరు అతిక్రమించిన ఉపేక్షించే ప్రసక్తే లేదు..సీఐ కే నాగరాజు

నాగార్జునసాగర్ (నందికొండ),ఆగస్టు 26,(జనం సాక్షి);
శాంతియుతంగా వినాయక చవితి పండుగను నిర్వహించుకోవాలని, నిబంధనలు ఎవరూ అతిక్రమించొద్దని విజయపురి నార్త్ డివిజన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు అన్నారు.  పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వినాయక చవితి పండుగ సందర్భంగా నందికొండ పట్టణానికి చెందిన హిందూ,ముస్లింలు, యువకులు,వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను దృష్టిలో పె ట్టుకొని పలు సూచనలు సలహాలు తెలియజేశారు.
వినాయక మండపాలు ఏర్పాటుకు పోలీసులు,విద్యుత్‌ శాఖ అధికారుల నుంచి అనుమతి తప్పనిసరి అన్నారు. నిమజ్జన ఊరేగింపులో డీజేలు,సౌండ్‌ బాక్సులను ఉపయోగించరాదని, ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక ఎస్సై బి రాంబాబు మాట్లాడుతూ ఈనెల 31న వినాయక చవితి సందర్భంగా ముందు జాగ్రత్తగా పలు కాలనీల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాల వద్ద కమిటీ సభ్యులు జాగ్రత్తలు వహించాలన్నారు. ఆలయాలు,మసీదులు,దర్గాల వద్ద ఎలాంటి ఘటనలు,అల్లర్లు చేయకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.ప్రస్తుతం 30 యాక్ట్‌ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు,ధర్నాలకు అనుమతి లేదన్నారు. మండపాలు ఏర్పాటు చేసుకునే ముందు స్టేషన్‌లో అనుమతి తీసుకోవాలన్నారు.అదేవిధంగా కమిటీ సభ్యుల పేర్ల వివరాలు తెలుపాలన్నారు. కార్యక్రమంలో హిందూ,ముస్లింలు,యువకులు పాల్గొన్నారు.