Tuesday, 3 November 2026

నిరంతర విద్యుత్‌పై క్షేత్రస్థాయి పరిశీలన

ఆదిలాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వం జనవరి1 నుంచి కొత్త సంవత్సరం కానుకగా రైతులకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తును సరఫరా చేయడంతో పాటు లాభనష్టాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. రైతులను కలసి వివరాలు తెలుసుకుంటున్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్న నేపథ్యంలో రైతులకు ఆటోమెటిక్‌ స్టార్టర్ల అవసరం ఉండదు. ఆ స్టార్టర్లను తీసివేయాలంటూ విద్యుత్‌ శాఖ అధికారులు ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారు. నిరంతరం కరెంటు సరఫరా అవుతుండడంతో రైతులు తమకు అవసరమైన సమయంలో పంటలకు నీరు అందించుకునే అవకాశం ఏర్పడింది. దీంతో రైతులు స్వయంగా తమ పొలాల్లోని ఆటోమెటిక్‌ స్టార్టర్లను తీసివేశారని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తుండడంతో రైతులు మంచి కెపాసిటర్లు పెట్టుకోవాలని, వీటితో వోల్టేజీ సమస్యను నివారించవచ్చని అధికారులు అంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో రైతులు యాసంగిలో శనగ, గోధుమ, వేరుశనగ, జొన్న లాంటి పంటలను సాగుచేస్తారు. వానాకాలం వేసిన పత్తితో పాటు యాసంగి పంటలను కరెంటు మోటార్లు, బోర్ల ద్వారా నీటిని అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు ఒక మిలియన్‌యూనిట్‌ విద్యుత్‌ వినియోగమవుతుంది. ఇంతకాలం వ్యవసాయ రంగానికి తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా కాగా.. సాగుకు నిరంతరం 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేయడానికి అధికారులు పక్కా ప్రణాళికలు తయారుచేసి విజయవంతంగా అమలుచేశారు.