Tuesday, 3 November 2026

నిలోఫర్‌ ఘటనపై స్పందించిన అధికారులు

విచారణకు ఆదేశించిన మెడికల్‌ సూపరింటెండెంట్‌

హైదరాబాద్‌, మార్చి 02 (జ‌నంసాక్షి) : నిలోఫర్‌ ఘటనపై వైద్య, ఆరోగ్య అధికారులు స్పందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈఘటనపై విచారణకు ఆదేశించారు. ఒకే సిరంజితో ఐదుగురు చిన్నారులకు ఇంజెక్షన్‌ చేశారని, దీంతో చిన్నారుల చేతులకు వాపులు వచ్చాయని, రక్తం గడ్డ కట్టిందని బాధితులు సోమవారం మెడికల్‌ సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సూపరింటెండెంట్‌ ఘటనపై విచారణకు ఆదేశించారు.

వివరాల్లోకెళితే.. నిలోఫర్‌ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగం మూడో అంతస్తులో ఐదేళ్లలోపున్న 30 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వైద్యులు రాసిచ్చిన దాని ప్రకారం. వారికి రెగ్యులర్‌గా ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు ఒక్కో రోగికి ఒక్కో సిరంజిని ఉపయోగించాలి. కానీ, ఆదివారం రాత్రి విధులు నిర్వర్తిస్తున్న నర్సులు ఒకే సిరంజితో అందరు చిన్నారులకు ఇంజెక్షన్లు చేశారు. దీంతో కొందరికి చేతులు వాచిపోగా… మరికొందరికి రక్తం గడ్డ కట్టింది. ఇది గమనించిన చిన్నారుల తల్లిదండ్రులు నర్సులను నిలదీయగా.. తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో చిన్నారుల తల్లీదండ్రులు ఆందోళనలకు దిగారు. ఆదివారం కావడంతో వైద్యులు అందుబాటులో లేరు. పోలీసులు తల్లిదండ్రులను శాంతింపజేసి సోమవారం అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ మేరకు సోమవారం బాధితులు మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *