హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ప్రజలు సూచించిన మేరకు గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశంగా చెబుతోంది. దీని ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని కేసీఆర్ సర్కారు ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ప్రజల దృష్టిని మళ్లించేందుకు సర్కారు ఎత్తుగడగా విపక్షాలు గ్రామజ్యోతిని అభిర్ణిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గ్రామజ్యోతిని ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ప్రారంభించనున్నారు. పంచాయతీని అన్ని విధాలుగా పటిష్ట పరచడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. గ్రామంలో రహదారులు, మురుగు కాలువలు, వీధిదీపాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, కూలీల ఉపాధి, హరితహారం తదితర మౌలిక వసతులను మెరుగు పరుస్తారు. గ్రామజ్యోతిలో భాగంగా పంచాయతీల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న సేవలను మరింత మెరుగు పరచాలని నిర్ణయించారు.
సమస్యలు వంద శాతం నిర్మూలించాలన్నదే లక్ష్యం..
పంచాయతీల్లో పారిశుద్ధ్యం, వైద్యం, విద్య, పౌష్టికాహారం, పేదరిక నిర్మూలనలు వంద శాతం నిర్మూలించాలన్నది సర్కారు యోచన. అందుకే మెరుగైన ఫలితాలు సాధించేలా గ్రామాల మధ్య పోటీ పెట్టాలనీ ప్రభుత్వం యోచిస్తోంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామాలకు అదనపు నిధులు ఇస్తామని ప్రకటించింది.
విపక్షాల పెదవి విరుపు..
పంచాయతీల్లో వంద శాతం పన్నుల వసూళ్లు, ఇంటింటి సర్వే నిర్వహణలతో పాటు.. చెరువుల మరమ్మతులు, సుందరీకరణ అంశాలనూ గ్రామజ్యోతిలో పొందుపరిచారు. అయితే గ్రామజ్యోతి కార్యక్రమంపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. మన ఊరు మన ప్రణాళిక రూపొందించి ఏడాది దాటినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మొత్తానికి గ్రామజ్యోతి ద్వారా.. మంత్రులు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు.. వచ్చే పది రోజులూ.. గ్రామాల చుట్టూ ప్రదక్షిణలు చేయనున్నారు.




