Monday, 2 November 2026

నేడు న్యాయవాదులకు సంక్షేమ కార్యక్రమాలు

హైదరాబాద్‌,మే31(జ‌నం సాక్షి):  రాష్ట్రంలోని న్యాయవాదులకు జూన్‌ 1 నుంచి వివిధ సంక్షేమ పథకాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ వేడుకల సందర్భంగా న్యాయవాదులకు హెల్త్‌కార్డులు, ప్రమాదబీమాతోపాటు ఆర్థికసహాయం వంటి పథకాలను శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరుగనున్న కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బీ వినోద్‌కుమార్‌ ప్రారంభించనున్నారు. ఆర్థికసహాయ నిధులను ఆయా న్యాయవాదుల సంఘాలకు చెక్కుల రూపంలో అందజేయనున్నారు. న్యాయవాదుల సంఘాల ద్వారా బీమా పత్రాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కేటాయించిన రూ.100 కోట్ల నిధులతో తెలంగాణ స్టేట్‌ అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను అమలుచేయనున్న విషయం తెలిసిందే. శుక్రవారం రవీంద్రభారతిలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని న్యాయవాదులు భారీగా తరలిరానున్నారు.