మధుసూధనాచారి,చందూలాల్ గెలుపుపై దృష్టి
భారీగా ఏర్పాట్లు చేసిన టిఆర్‌ఎస్ నేతలు
కూటమి నేతల కుట్రలను తిప్పికొట్టాలన్న కడియం
వరంగల్,నవంబర్29(జనంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శుక్రవారం జిల్లాకు రానున్నారు. ములుగు, భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కెసిఆర్ పాల్గొంటారు. మాజీ స్పీకర్ మధుసూధనాచారి మంత్రి చందూలాల్ గెలుపు కోసం కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో జరిగే సభల్లో పాల్గొననుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభలపై జిల్లా ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. వేర్వేరుగా జరిగే ఆశీర్వాద సభలకు హాజరయ్యేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ శ్రేణులు సభల సక్సెస్‌పై దృష్టి సారించారు. సుమారు అరవై వేల మందితో ఒక్కో సభ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ములుగు, భూపాలపల్లిలో ప్రజా ఆశీర్వాద సభల నిర్వహణ ఏర్పాట్లపై స్థానిక టీఆర్‌ఎస్ నేతలతో సవిూక్ష జరిపారు. తొలుత సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2.10 గంటలకు హెలీకాప్టర్ ద్వారా ములుగు చేరుకుంటారు. ఇక్కడ జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న తర్వాత 2.40 గంటలకు భూపాలపల్లికి బయల్దేరుతారు. 2.55 గంటలకు భూపాలపల్లిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని, ఇక్కడి నుంచి 3.25 గంటలకు పెద్దపల్లి జిల్లా మంథనికి వెళ్తారు. 3.40 గంటలకు మంథని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారు కావడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సభల నిర్వహణపై దృష్టి పెట్టారు. ఈ మేరకు ములుగులో బండారుపల్లి రోడ్డులో, భూపాలపల్లిలో జాతీయ రహదారిని ఆనుకుని బాంబులగడ్డ వద్ద ఉన్న విశాలమైన స్థలంలో ప్రజా ఆశీర్వాద సభల నిర్వహణకు నిర్ణయించారు. భూపాలపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి నేతలతో కలిసి బాంబులగడ్డను సందర్శించి సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించారు. ములుగు బండారుపల్లి రోడ్డులో ని స్థలాన్ని టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి అజ్మీరా చందూలాల్, ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా ప్రహ్లాద్ పరిశీలించారు. గ్రామాల వారీగా గులాబీ శ్రేణులకు జన సవిూకరణ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా
మహా కూటమిపై డిప్యూటి సిఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. ప్రధానంగా కూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరిని ఉద్దరించటానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న సాగునీటి
ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలని కేంద్ర జలవనరుల సంఘానికి అనేక ఫిర్యాదులు చేసిన చంద్రబాబుతో కాంగ్రెస్ జత కట్టడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ భుజాన తుపాకీ పెట్టి చంద్రబాబు తెలంగాణ ప్రజల హక్కులను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని, అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడని అన్నారు. టీజేఎస్ అధినేత కోదండరాం అవకాశవాద నినాదంతో ముందుకు సాగుతున్నాడని విరుచుకపడ్డారు. గతంలో తెలుగుదేశం పార్టీని తెలంగాణ ద్రోహుల పార్టీగా అభివర్ణించిన కోదండరాం ఇపుడు అదే టీడీపీని తెలంగాణకు అనుకూల పార్టీగా ప్రచారం చేస్తున్నాడని కడియం విమర్శించారు. మహాకూటమిలో భాగస్వామి అయిన కోదండరాం కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ తమను మోసం చేసిందని, అవగాహన లేక నష్టపోయామని, తమకు కేటాయించిన సీట్లలో పొత్తు ధర్మాన్ని విస్మరించి కాంగ్రెస్ పార్టీ బీ పారాలు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి సభ్యత, సంస్కారం లేదని, అతను తెలంగాణ రాజకీయాల్లో చీడ పురుగు, బ్లాక్ మెయిలరని అన్నారు. తెలంగాణ హక్కులను కాపాడుకోవటానికి టీఆర్‌ఎస్ ఒకటే సరైన పార్టీ అనేది ప్రజలు గుర్తించాలని, టీఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణ హక్కులను రక్షించేందుకు పనిచేయగలదని ఆయన తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు ఏర్పాటు చేసిన పది ఎన్నికల ఆశీర్వాద సభలు విజయవంతం అయ్యాయంటే ఈ జిల్లాలో సీఎం కేసీఆర్ గాలి వీస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ చేపట్టిన పది ఎన్నికల ప్రచార సభలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారన్నారు.




