హైదరాబాద్ : పెరుగుతున్న నిత్యావసరాల ధరలను తగ్గించాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా పార్టీ కేంద్రకమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్, డివిజన్ కార్యాలయాలను సోమవారం ముట్టడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పేదలకు నిత్యావసరాలను చౌకధరలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ విషయమై ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిత్యావసర వస్తువుల చట్టాన్ని కఠినతరం చేయాలని, కేంద్ర పంపిణీ వ్యవస్థ చట్టాల్లో మార్పులు తేవాలని, ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓవైపు కరువు, రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించటం లేదని విమర్శించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు పనులు కల్పించాలని సూచించారు.




