Monday, 2 November 2026

నేను బేరానికొచ్చానా..!

-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపణలను తోసిపుచ్చిన విజయ్‌ మాల్యా
న్యూఢిల్లీ, జూన్‌30(జ‌నం సాక్షి) : వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌ మాల్యా ఎట్టకేలకు రెండేళ్ల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తాజాగా నోరువిప్పిన విషయం తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణలు ఏమిటో .. అసలు నిజాలేమిటో.. వెల్లడించాల్సిన బాధ్యత తనపై ఉందంటూ ఇటీవల ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. దీంతో మాల్యా బేరానికి దిగొచ్చారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై మాల్యా శనివారం స్పందించారు. తనది బేరమైతే.. ఈడీ అధికారులు కూడా అదే సిద్ధాంతాన్ని అనుసరించాలని ఎద్దేవా చేశారు. ఇటీవల ఈడీ అధికారులు స్పందిస్తూ.. ‘బ్యాంకులకు రుణాల చెల్లించే ఉద్దేశం తనకు ఉందని, అందుకోసం ఆస్తులను అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని విజయ్‌ మాల్యా బేరసారాలకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటివి మన దేశంలో కుదరదని, ఓ పారిపోయిన నిందితుడికి దేశంలోని నిబంధనలను చెప్పాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కొన్ని విూడియాల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై  మాల్యా స్పందించారు. ట్విటర్‌ వేదికగా ఈడీ ఆరోపణలను తోసిపుచ్చారు. ‘నేను బేరసారాలకు ప్రయత్నిస్తున్నానని ఈడీ అధికారులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అలా చెప్పిన అధికారులకు నా వినయపూర్వక సలహా ఒకటే.. ముందు ఈడీ ఛార్జ్‌షీట్‌ చదవండి. అదే నిజమైతే ఈడీ అధికారులు కూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరించి.. ఎక్కడైతే నా ఆస్తులు ఉన్నాయో ఆ కోర్టుల్లో ఇలాంటి
బేరసారాల ఒప్పందానికి రావాలని ఆహ్వానిస్తున్నా’ అని మాల్యా ట్వీట్‌ చేశారు.