Tuesday, 3 November 2026

నేరస్థులను పట్టుకునేందుకు.. 

అందుబాటులోకి నూతన టెక్నాలజీ
– దేశంలోనే తొలిసారిగా ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ తీసుకొచ్చాం
– నేరాలను అదుపు చేయడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది
– కికీ ఛాలెంజ్‌.. సాహసాలకు ఎవరూ పాల్పడొద్దు
– అలాచేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు
– విలేకరుల సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్‌, ఆగస్టు2(జ‌నం సాక్షి) : నేరస్థులను గుర్తించేందుకు తెలంగాణ పోలీస్‌ శాఖ కొత్తటెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిందని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ నేరస్థుల ఫోటోలను ఫేస్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీకి అనుసంధానం చేస్తామన్నారు. దీని ద్వారా నేరం జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ కెమెరా దృశ్యాలను ఫేస్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీతో పోల్చి నిందుతులను పట్టుకోవడం ఈజీ అవుతుందని మహేందర్‌రెడ్డి తెలిపారు. దేశంలో తొలిసారిగా ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ తీసుకొస్తున్నామన్నారు. పాత నేరస్తుల వివరాలు, ఫింగర్‌ ప్రింట్స్‌ను సిస్టమ్‌లో పొందుపరుస్తామని, నేరాలను అదుపు చేయడానికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని డీజీపీ తెలిపారు. ఇన్వెస్టిగేషన్‌ అధికారులకు టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా టెక్నాలజీ లోగోను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. కికీ ఛాలెంజ్‌ విషయంలో ఎవరూ సాహసం చేయొద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. నడుస్తున్న వాహనంలో నుంచి దిగి నృత్యం చేయడం ప్రాణాంతకమని చెప్పారు. ఈ ఛాలెంజ్‌తో ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. కికీ ఛాలెంజ్‌ సాహసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.
కికీ ఛాలెంజ్‌ లో భాగంగా చాలామంది యువత వాహనాలు నడుపుతూ రోడ్లపై నృత్యాలు చేస్తూ, కదులుతున్న వాహనంపై నుంచి దూకుతున్న విషయం విదితమే. కికీ చాలెంజ్‌కు ప్రేరణ పొంది యువకులు ఇలా చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్‌ అయ్యారు. కదులుతున్న కార్లపై నుంచి దూకడం… రోడ్డు మధ్యలో నృత్యాలు చేయడం చాలా ప్రమాదకరమని, వాహనాలు నడుపుతున్న వారితో పాటు అందులో ప్రయాణిస్తున్న వారికి, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ఇది ప్రమాదమని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకుంటున్నామని, కికీ చాలెంజ్‌కు ప్రేరేపితమై ప్రమాదకరమైన డ్రైవింగ్‌ చేసే వారిపై క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకుంటామన్నారు. యువకులు అలాంటి స్టంట్లు, ప్రమాదకరమైన డ్రైవింగ్‌ల జోలికి వెళ్లవద్దని సూచించారు.