నైరుతి రుతుపవనాలు రైతన్నలతో దోబూచులాడుతున్నాయి. ఈ ఏడాది వారం ముందే రుతుపవనాలు వస్తాయన్న వాతావరణశాఖ అంచనాలతో ఉత్సాహాన్ని నింపుకొన్న అన్నదాతకు నిరాశే మిగిలింది. వానల కోసం కళ్లలో వత్తులు వేసుకొని ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వానలు దండిగా కురుస్తాయన్న నివేదికలతో ఇప్పటికే రైతులు దుక్కులు దున్నుకుని..విత్తనాలను సైతం సిద్ధం చేసుకున్నారు.
గతేడాదితో పోలిస్తే వర్షాల రాక ఇప్పటికే వారం రోజులు ఆలస్యమైంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకేందుకు మరో నాలుగు రోజులు పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే నైరుతి రుతువపనాలు దాదాపు ఆగిపోయి… ఒకేచోట స్థిరంగా ఉన్నాయి.
అయితే అల్పపీడనాలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంపై ఆవర్తన ద్రోణి ప్రభావం కూడా లేకపోవడం వల్ల గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో స్వల్పంగా పెరుగుదల నమోదవుతుందని పేర్కొన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నట్టు చెప్పారు. మరో రెండురోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదల నమోదవుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం రుతుపవనాలు కొంత బలహీనపడినప్పటికి రెండు, మూడు రోజుల్లో మరింత పుంజుకునే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొన్నది. రానున్న48గంటల్లో పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించనున్నాయని అంచనా వేస్తున్నది.రానున్న రెండు రోజులు మినహాయించి దేశవ్యాప్తంగా ఈ నెల వర్షపాతం తక్కువగా ఉంటుందని తెలిపింది. జూన్ చివరి రెండు వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా




