Tuesday, 3 November 2026

న్యూసెంచరీ పబ్లిక్‌ స్కూల్‌ సీజ్‌

అసంపూర్తి నిర్మాణాలను కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం
– యాజమాన్యం, సిబ్బందిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు
స్కూలుపై దాడికి పాల్పడ్డ విద్యార్థి సంఘాలు
ఫర్నీచర్‌, బస్సుల ధ్వంసం
విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పిస్తామన్న డీఈఓ
హైదరాబాద్‌, ఆగస్టు3(జ‌నం సాక్షి): ఇద్దరు చిన్నారుల మృతికి కారణమైన కూకట్‌పల్లిలోని న్యూసెంచరీ పబ్లిక్‌ స్కూల్‌ను అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు. దీనికితోడు స్కూల్‌లోని అసంపూర్తి నిర్మాణాలను కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో గురువారం మధ్యాహ్నం పాఠశాల భవనం కూలిన ఘటన చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే శుక్రవారం మరోసారి మృతులు కుటుంబ సభ్యులు స్కూల్‌పై దాడికి దిగారు. విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగాయి. ఆగ్రహంతో స్కూల్‌ లోపల ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.. బస్సుల అద్దాలను పగులగొట్టి, వాటిని పక్కకు తోసేశారు. ఇద్దరు పసివాళ్ల మృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకొని.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడగా.. పోలీసులు సర్థిచెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. కూకట్‌పల్లి శ్రీకృష్ణానగర్‌లో పదిహేనేళ్లుగా న్యూసెంచరీ పాఠశాల కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల సమయంలో పాఠశాల ఆవరణలోని వేదికపై వ్యాయామ ఉపాధ్యాయుడు నాలుగో తరగతి విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్నారు. ఆరుబయట ఉన్న వేదికకు చుట్టూ ఆరుస్తంభాలు నిర్మించారు. వాటిని కలుపుతూ పైన విూటరు వెడల్పుతో కూడిన ప్లింత్‌ బీమ్‌లు ఉన్నాయి. అక్కడ విద్యార్థులు శిక్షణ పొందుతుండగా బీమ్‌లు భారీ శబ్దంతో కుప్పకూలాయి. వాటి పెళ్లలు విూద పడటంతో డి.మణికీర్తన (9), చందనాశ్రీ (8), నిఖిత (9), నరేష్‌ (11), సందీప్‌ (10), దేవిశ్రీ (10), సహస్ర (9) అనే విద్యార్థులకు గాయాలయ్యాయి. పాఠశాల నిర్వాహకులు వారిని వివేకానందనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా.. మణికీర్తన, చందనాశ్రీలు అప్పటికే మృతి చెందారు. నరేష్‌ కోమాలోకి వెళ్లడంతో నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మిగతావారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై  స్కూల్‌ యాజమాన్యం, సిబ్బందిపై కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఘటన అనంతరం పరారీలో ఉన్న స్కూల్‌ యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
విద్యార్థుల విద్యకు ఇబ్బందులు రానివ్వం – డీఈఓ
విద్యాసంవత్సరం మధ్యలో పాఠశాల మూసివేతతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లల విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని, ఈ ఏడాది వరకైనా పాఠ్యాంశాల బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా చర్యలు తీసుకుంటామని డీఈవో తెలిపారు. విద్యార్థులను సవిూప పాఠశాలల్లో చదివిస్తామని చెప్పారు. ఆయా పాఠశాలలతో మాట్లాడి తల్లిదండ్రులపై భారం పడకుండా చూస్తామని వెల్లడించారు. పాఠ్యాంశాల విషయమై విద్యార్థులు ఆందోళన చెందనక్కర్లేదని డీఈఓ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ఘటన జరిగిన పాఠశాలను మేడ్చల్‌ సంయుక్త కలెక్టర్‌ శ్రీనివాస్‌ సందర్శించారు. పాఠశాల పూర్తి శిథిలావస్థకు చేరిందని తెలిపారు. పాఠశాలలో ప్రస్తుతం 160 మంది విద్యార్థులు ఉన్నారని.. వారిని ఇతర పాఠశాలల్లో చేర్పిస్తామని చెప్పారు. పాఠశాల అనుమతికి సంబంధించి దర్యాప్తు చేస్తామని.. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు
తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.