Thursday, 5 November 2026

పంచకర్మ ఆయుర్వేదంలో ఎస్సీలకు శిక్షణ

నియామక పత్రాలు అందించి అభినందించిన మంత్రి

హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): దారిద్య రేఖకు దిగువన ఉన్న ఎస్సీలను అభివృద్ధి పథం వైపు పయనింపజేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ నిధం, అపోలో లాంటి పేరొందిన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తుందని తెలిపారు. పంచకర్మ సిద్ధాంతంతో ప్రాచీన ఆయుర్వేద వైద్యం మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చినట్లు అయిందని రాష్ట్ర విద్యుత్‌,ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అభిప్రాయపడ్డారు. ఎస్సీ అభివృద్ధి శాఖ నిధం ఆధ్వర్యంలో జరిగిన వృత్తి నైపుణ్య కోర్సుల శిక్షణా శిబిరం ముగింపు సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ సౌజన్యంతో నిధం శాంతిగిరి ఆశ్రమంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎస్సీ నిరుద్యోగ యువతకు ఆరు నెలల వృత్తి నైపుణ్య కోర్సుల శిక్షణ ముగిసింది. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సీ నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలను మంత్రి అందజేశారు. వృత్తి నైపుణ్య శిక్షణ పొంది ఉద్యోగాలు పొందిన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పంచకర్మ వైద్యాన్ని అందిస్తున్న శాంతిగిరి ఆశ్రమం సేవలు అభినందనీయమన్నారు. తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు చర్యలు బాగున్నాయన్నారు. ఒక్కో విద్యార్థిపై రూ. 54 వేలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇప్పించిందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు వేర్వేరు రాష్ట్రాల్లో ఉద్యోగాలు కల్పించిందన్నారు.