Friday, 6 November 2026

పంచాయితీరాజ్‌ చట్టంతో పదును

స్వచ్ఛ గ్రామాలు లక్ష్యంగా కార్యక్రమాలు 
చెత్తవేస్తే భారీ జరిమానాల విధింపు
హైదరాబాద్‌,మే21(జ‌నం సాక్షి): పటిష్టమైన పంచాయితీ చట్టంతో పంచాయితీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఇప్పటికే బిసి గణన ప్రారంభం అయ్యింది.  గ్రామ పంచాయతీలను స్వచ్ఛంగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా ఉండేందుకు పంచాయతీ రాజ్‌ చట్టం అమలుకు రంగం సిద్దం చేసింది. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత, పచ్చదనంలో యువతపై బాధ్యతలు వేస్తూ తీసుకువచ్చిన కొత్త చట్టం వచ్చే పాలకవర్గం నుంచి అమలు లోకి రానున్నది. పంచాయతీరాజ్‌ కొత్త చట్టంతో గ్రామాల రూపురేఖలు మారిపోతాయి. ప్లలెల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కారు.. కొత్త చట్టాన్ని కచ్చితంగా అమల్లోపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నది. ఇంటి ముందు చెత్త వేసినా, మురుగు నీటిని వదిలినా, ఏమాత్రం పరిశుభ్రతను పాటించకపోయినా.. భారీ మొత్తంలో  జరిమానా విధించనున్నారు. నూరుశాతం అభివృద్ధి సాధించేలా గ్రామాలను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైకుంఠధామాల నిర్మాణం, డంపింగ్‌ యార్డుల నిర్వహణ, పూర్తి పరిశుభ్రత సాధించే గ్రామాలకు అవార్డులు అందిస్తారు. ప్రతి ఐదేండ్లకు పంచాయతీ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక, వార్షిక ప్రణాళికను ఎంపీటీసీలు ఆమోదించాలి.  కొత్త చట్టం ప్రకారం ఎవరి ఇంటి ముందు చెత్త కనిపించినా ఆ ఇంటి యజమానులదే బాధ్యత. అందుకుగానూ రూ. 500 జరిమానా వసూలు చేయనున్నారు. అలాగే ఇంటి ముందు మురుగునీరు వదిలే వారికి రూ.5 వేల జరిమానా విధించనున్నారు. ఇదే చట్టంలో గ్రీన్‌ట్యాక్స్‌ను కూడా చేర్చారు. దీని ప్రకారం ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఆరు మొక్కలు నాటాల్సిందే. వీటిలో కనీసం మూడు మొక్కలు ఎదగాలి. అలాకాని పక్షంలో ఆస్తి పన్నుకు రెండింతల జరిమానాను ఆఇంటి యాజమనికి విధించనున్నారు.   ప్రాదేశిక నియోజకవర్గం పరిధిలో ప్రజల్లో స్వయం సహాయస్ఫూర్తిని పెంపొందించాలి.  ప్రజల జీవనప్రమాణాలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించాలి.  గ్రామ పంచాయతీల పన్ను విధానాల్లో మార్పులు తీసుకురావడంతోపాటు వసూలు బాధ్యతలను పరిషత్‌ సభ్యులకు అప్పగించనున్నారు. భూమి సెస్సు, స్థానిక సెస్సులను గరిష్ఠ పరిమితికి లోబడి, సర్‌చార్జి రూపంలో పన్నులను విధించే అధికారం పరిషత్‌ సభ్యులకు ఉంటుంది.  ఉపాధి హావిూ పథకంలో పంచాయతీ కార్మిక బడ్జెట్‌ ప్రణాళికలను ఆమోదించి, పనులను పర్యవేక్షించాలి.  వయోజన విద్య కార్యక్రమాలను పర్యవేక్షించడంతోపాటు ఖాదీ, గ్రావిూణ పరిశ్రమల కమిషన్‌ కార్యకలాపాలను అమలుచేయాలి.  స్వయం సహాయక బృందాలతో స్వయంఉపాధి, జీవనోపాధి పథకాలు, బ్యాంకుల అనుసంధాన కార్యక్రమాలను చూసుకోవాలి.  రక్షిత మంచినీటి పథకం, స్నానాలకు ఏర్పాట్లు, నీటి సరఫరా నిర్మాణాలు.. నిర్వహణ చేపట్టాలి. దీనికోసం ఏదైనా సంస్థతో నిర్వహణ ఒప్పందం చేసుకొని పర్యవేక్షించాలి. ప్రభుత్వ వైద్యశాలలు, శిశు సంక్షేమకేంద్రాలను నిర్వహించే అధికారం ఎంపీటీసీ సభ్యులదే. మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులపై బాధ్యతలను పెంచిన ప్రభుత్వం.. వాటిని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకొనేందుకు చట్టంలో మార్పులు చేసింది. ఎంపీపీ తీర్మానాల అమలుకు ఎంపీడీవోలపై పరిపాలనాపరమైన నియంత్రణాధికారాన్ని వినియోగించుకునే అవకాశం ఎంపీపీలకు కల్పించారు. సర్వసభ్య సమావేశాలకు అధ్యక్షత వహించడం, రికార్డుల పర్యవేక్షణపై పూర్తిహక్కులను కల్పించారు. వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, అంటువ్యాధులు ప్రబలడం, తాగునీటి సరఫరా నిలిచిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రెసిడెంట్లు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, అధికారులతో అత్యవసర పనులు చేయించవచ్చు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించే నిర్మాణాలు, ఇతర పనులను చేయాలని అధికారులపై ఒత్తిడి తేవడంపై ఆంక్షలు విధించారు. ఎంపీడీవో, జెడ్పీ సీఈవో అధికారాలకు.. ప్రజాప్రతినిధుల అధికారాలకు సంబంధం లేకుండా చట్టంలో మార్పులుచేశారు. మండల పరిషత్‌ అధ్యక్షుడు వరుసగా 15 రోజులు మండలానికి, కార్యాలయానికి రాకుంటే ఆయన విధుల్లోంచి వైదొలిగినట్టే. 15 రోజులు కార్యాలయానికి రాకుంటే.. పరిషత్‌ ప్రెసిడెంట్లను తొలిగించినట్టుగా భావిస్తూ ఉపాధ్యక్షుడికి బాధ్యతలను అప్పగించాలి. ప్రెసిడెంట్‌తోపాటు వైస్‌ ప్రెసిడెంట్‌ 15 రోజులు కార్యాలయానికి రాకుంటే.. సంబంధిత ఎంపీడీవోలు ఆ బాధ్యతలను నిర్వర్తించాలి. మండల ప్రజా పరిషత్‌ పరిధిలో జరిగే పనుల్లో నిర్లక్ష్యం, ఆస్తుల నష్టం వంటి అంశాలను అధికారులకు ముందుగా వివరించాల్సిన బాధ్యత ఎంపీపీ,
ఎంపీటీసీ సభ్యులదే. నేరుగా చర్యలు తీసుకునే అధికారం వారికిలేదు. మండల పరిషత్‌కు వచ్చిన నిధులన్నీ పరిషత్‌ నిధిగా ఏర్పాటుచేసి, అందరి ఆమోదంతో వినియోగించాలి. వచ్చిన నిధులను ప్రభుత్వ ఖజానాలోనే జమచేయాలి. ఉద్యోగ భద్రత పథకం, ఇతర వేతనాలు, ఉపాధి నిధులను జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో జమచేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
————-