బిసి జనాభా వివరాలు ఇవ్వకుండా జాప్యం
మండిపడ్డ మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్,జూలై13(జనం సాక్షి): కోర్టులను సాకుగా చూపి పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. బీసీల జనాభా వివరాలను ప్రభుత్వం కోర్టుకు ఇవ్వలేదని, సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఎందుకు బయటపెట్టడంలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసే కుట్ర చేస్తోందని, జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. లెక్కలు పక్కాగా ఉన్నా వాటిని నిర్వహించే తీరు సక్రమంగా లేకపోవడం కారణంగానే చిక్కులు వచ్చాయన్నారు. ఇదిలావుంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా మభ్యపెడుతున్న సర్కార్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధి కారంలోకి వచ్చిన టీఆర్ఎస్ వాటికి తిలోదకాలు ఇచ్చి ధనార్జనే ధ్యేయంగా అవినీతి పాలన సాగి స్తోందని ఆరోపించారు. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు రావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వేల పేరిట ప్రజలను మభ్యపెడుతూ మరోసారి అధికారంలోకి రావాలని కంటున్న కలలు నెరవేరబోవన్నారు. సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసేందుకే ప్రభుత్వం తహతహలాడుతోందని, ఎన్నికలంటే సీఎంకు భయం పట్టుకుందన్నారు. సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లీస్తూ.. దళిత గిరిజనులను దగా చేసిన టీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజాధనాన్ని దోచుకుంటున్న ప్రభుత్వ తీరును ప్రజలు గ్రహించారన్నారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసు.. డ్రగ్స్, మియాపూర్ భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎన్ని మాయమాటలు చెప్పిన ప్రజ లు నమ్మే పరిస్థితిలో లేరని.. భూస్థాపితం చేసేం దుకు ప్రజలు కాసుకోని ఉన్నారని హెచ్చరించారు




