అట్రాసిటీ చట్టం పరిరక్షణ కోరుతూ రావెల దీక్ష
గుంటూరు,జూలై13(జనం సాక్షి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. దళిత, గిరిజన సంఘాల కార్యకర్తలు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా దళిత గిరిజనులకు రక్షణ కవచంలా నిలిచిన ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రమాదంలో పడిందని.. సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందని కిషోర్‌బాబు అన్నారు. ఈ చట్టాన్ని పరిరక్షించేందుకు కేంద్రం వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కోరారు. బిల్లుల సమగ్ర రక్షణకు ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు. రాత్రి ఏడు గంటల వరకూ తన దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు.