Thursday, 5 November 2026

పంజాగుట్ట మార్గంలో ఆర్టీసీ బస్సుల రాకపోకల్లో మార్పులు

హైదరాబాద్‌ సిటీ: పంజాగుట్ట మార్గంలో ఆర్టీసీ బస్సుల రాకపోకల్లో మార్పులు చేశామని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎ.పురుషోత్తం తెలిపారు. ఈనెల 20నుంచి పంజాగుట్ట నిమ్స్‌ మెట్రో పనుల మూలంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఇందులో భాగంగా నిమ్స్‌కు వచ్చే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని సిటీ ఆర్డినరీ, ఏసీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల రాకపోకల్లో మార్పులు చేశామన్నారు. మంగళవారం ఉదయం నుంచి ఖైరతాబాద్‌ నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే ఆర్డినరీ బస్సులు సోమాజిగూడ కెసీపీ చౌరస్తా నుంచి ఎడమ వైపుకి తిరిగి తాజ్‌ కృష్ణా, జీవీకే.వన్‌, నిమ్స్‌వెనక వైపు, నాగార్జున సర్కిల్‌ నుంచి పంజాగుట్ట చౌరస్తా కు వచ్చి అమీర్‌పేట వైపు వెళతాయి. ఏసీ, మెట్రోఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సులు ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి రాజ్‌భవన్‌ మీదుగా సోమాజిగూడ రాజీవ్‌గాంధీ సర్కిల్‌ నుంచి పంజాగుట్ట చౌరస్తాకు వచ్చి అమీర్‌పేట వైపు వెళతాయని తెలిపారు. నిమ్స్‌కొచ్చే ప్రయాణికులకు అనుకూలంగా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల రాకపోకల్లో ఈ మార్పులు చేశామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *