భూసర్వే ప్రకారం రైతుల గుర్తింపు
హైదరాబాద్,మే9(జనం సాక్షి): రాష్ట్రంలోని భూములు సాగుచేస్తున్న రైతులందరికీ పెట్టుబడి పథకం కింద చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముందుగా భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి వందరోజుల్లో దానిని పూర్తిచేసింది. 58.34 లక్షల మంది రైతుల వద్ద 1.43 కోట్ల సాగు భూమి ఉందని తేల్చింది. ఈ భూమికి ఎకరానికి 4 వేల చొప్పున మొత్తం రూ.5,720 కోట్ల పెట్టుబడి సొమ్ము అందజేసేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనికోసం ప్రభుత్వం రూ.6,000 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులోభాగంగా మొదటిదశ లో రూ.1,602 కోట్లు, రెండోదశలో రూ.2,455 కోట్లు బ్యాంకులకు అందజేసింది. మిగతా మొత్తాన్ని కూడా మే 10 నాటికి బ్యాంకుల్లో జమచేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమైంది. రాష్ట్రంలోని 10,823 గ్రామాలకుగాను 160 గ్రామాల్లో అసలు సాగుభూమి లేదని వ్యవసాయ, రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10,663 గ్రామాల్లో పండుగ వాతావరణం మధ్య వారంరోజులపాటు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగనున్నది.
ముద్రణ పూర్తయిన పాస్ పుస్తకాలు జిల్లాల నుంచి మండలాలకు చేరాయి. వాటిని గ్రామాలవారీగా రైతులకు పంపిణీ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. పంపిణీ సకాలంలో జరుగడానికి వీలుగా ఒక్కో మండలంలో మూడు బృందాలను ఏర్పాటుచేశారు. ఇందులో ఒక బృందానికి తహసీల్దార్, మిగిలిన రెండు బృందాలకు డిప్యూటీ తహసీల్దార్, మండల వ్యవసాయశాఖాధికారి నాయకత్వం వహిస్తారు. ఒక్కో బృందంలో ఆరు నుంచి ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వీరు రైతుల వివరాలు సరిచూసుకుని పాస్‌పుస్తకం, చెక్కును ఒక కవర్లో ఉంచి భూ యజమానికి అందజేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటలవరకు, సాయం త్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు గ్రామాల్లో చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఈ మేరకు విధులు ఏ విధంగా నిర్వహించాలనేదానిపై ఆయా బృందాలకు అధికారులు శిక్షణఇచ్చారు.




