Thursday, 5 November 2026

రైతులకు అవగాహన కార్యక్రమాలు

గ్రామాలకు తరలిన గులాబీ దండు 
హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): యావత్‌దేశం ఆసక్తిని ప్రదర్శిస్తున్న రైతుబంధు పథకం అమలులో భాగస్వాములయ్యేందుకు టీఆర్‌ఎస్‌ కిందిస్థాయి శ్రేణులు సిద్దమయ్యాయి. ఇప్పటికే గ్రామాల్లో దీనిపై గులాబీ దండు ప్రచారంలోకి దిగింది.. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యవసాయరంగ నిపుణుడు స్వామినాథన్‌ సహా పలువురు ప్రశంసించారు. పలురాష్ట్రాలూ ఈ పథకం అమలుపై ఆసక్తిని చూపుతున్నాయి. ఈ నెల 10న సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని కరీంనగర్‌ జిల్లాలో ప్రారంభించనున్నారు. అదేరోజు ఇతర జిల్లాల్లోనూ మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పంపిణీని ప్రారంభిస్తారు. రైతుబంధు పథకంపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు, చెక్కుల సమాచారాన్ని వారికి చేరవేయడానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ ఆదేశాల మేరకు గ్రామాల్లో సాయం చేయబోతున్నారు.  మండలం యూనిట్‌గా వారం రోజులపాటు చెక్కుల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్‌ను ఖరారుచేసింది. దీనిప్రకారం ఏ గ్రామాల్లో ఏ రోజున ఏ సమయంలో చెక్కులు పంపిణీ చేస్తారనే దానిపై పార్టీపరంగా కరపత్రాల రూపంలో ప్రచారం చేయడానికి టీఆర్‌ఎస్‌ కిందిస్థాయి నేతలు సమాయత్తమయ్యారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్మన్‌, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జిల్లా, మండల, గ్రామ రైతు సమన్వయ కమిటీలు, పీఏసీఎస్‌ చైర్మన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రభుత్వపరంగా ఈ సమాచారం రైతులకు చేరుతున్నా.. పార్టీ కిందిస్థాయి యంత్రాంగాన్ని కూడా దీనికి వినియోగించుకుని రైతులకు మరింత చేరువకావచ్చని అధిష్ఠానం అంచనా వేస్తున్నది. రైతుబంధులో రైతు సమన్వయ సమితులను ప్రభుత్వం ఇప్పటికే భాగస్వాములను చేసింది. ఇప్పుడు వారికి తోడుగా పార్టీకి చెందిన స్థానిక నాయకులు కూడా ఉత్సాహంగా పాల్గొననున్నారు. రైతుబంధు చెక్కులు, కొత్త పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను ఆయా గ్రామాలకు పంపించారు. పంపిణీకేంద్రాల వద్ద టెంట్లువేయాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలకు చేరిన పాస్‌పుస్తకాలు, చెక్కులను పరిశీలించి గ్రామాలవారీగా పంపించాలన్నారు. ఏ గ్రామంలో ఏ రోజు కార్యక్రమం ఉంటుందో కూడా స్థానికంగా అందరికీ
తెలియజేయాలని స్పష్టంచేశారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ మంత్రులతోపాటు, అధికారులు కార్యక్రమం జరిగే రోజుల్లో గ్రామాల్లో పర్యటించి పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. వీరికి గులాబీదండు స్థానికంగా సాయం అందించనుంది.