– కొత్తగూడ బొటానికల్ గార్డెన్ ప్రజలకు అంకితం
– ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలి
– రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్
– కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌ను ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్, జులై11(జనం సాక్షి) : రాష్ట్రంలో పచ్చని హారంగా మార్చడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతూ మొక్కలు నాటడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం నగరంలో బొటానికల్ పార్కును కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌లోని 12 ఎకరాల పార్క్‌ను ప్రజలకు అంకితం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి ఉద్ఘాటించారు. ప్రతి నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారుతుంది. ప్రజలు సహకరిస్తేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు సరికొత్త పార్క్‌ను అందించామని తెలిపారు. పట్టణీకరణ జరిగితే పర్యావరణ దెబ్బతింటుందని పేర్కొన్నారు. కాలుష్యం బారినపడ్డ ఢిల్లీపై వస్తున్న వార్తలు మనల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పారు. కాలుష్యం భయంకరమైన సమస్యగా మారిందన్నారు. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నా.. ప్రపంచంలో చివరి స్థాయిలో ఉన్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టు పక్కల లక్షా యాభై వేల ఎకరాల అటవీ భూమి ఉందన్నారు. కాలుష్య కారక పరిశ్రమలను సీటి బయటకు తరలిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇక్కడ ఉండే 46 ఎకరాల డంపింగ్
యార్డును సైక్లింగ్ పార్క్‌గా ఏర్పాటు చేశామని తెలిపారు. హరితహారంలో, పార్కులను మెయింటెన్ చేయడంలో స్థానిక ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. రాబోయే తరాల కోసం సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని ఉద్యమస్ఫూర్తితో మొక్కలు నాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ మహానగరంలో 185 చెరువులున్నాయని, మొదటి దశలో 40 చెరువులు శుద్ధి చేసే పని చేపట్టామన్నారు. సీవరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. నాలుగు లక్షల ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశామన్నారు. 3300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే రెండోస్థానంలో ఉన్నామని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఓ అద్భుతనగరంగా తీర్చిదిద్దేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి రామన్న, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.




