Wednesday, 4 November 2026

పట్టపగలే దోపిడీకి యత్నించి.. పోలీసులకు చిక్కిన ప్రబుద్ధులు

చాదర్‌ఘాట్‌ : ఎంబీఏ పూర్తి చేసిన ఇద్దరు స్నేహితులు కలిసి పట్టపగలే దోపిడీకి ప్రయత్నించి శనివారం మధ్యాహ్నం మలక్‌పేట పోలీసులకు పట్టుబడ్డారు. మచ్చబొల్లారం నివాసి ఎస్‌డీ అమరేందర్‌రెడ్డి (25), ఎల్‌బీనగర్‌కు చెందిన భార్గవి (22) ఎంబీఏలో స్నేహితులు. ఎంబీఏ పూర్తయిన తర్వాత కూడా స్నేహాన్ని కొనసాగిస్తూ సులువుగా డబ్బులు సంపాదించేందుకు పథకం వేసుకున్నారు. ఇందుకు మలక్‌పేటలోని తిరుమల హిల్స్‌లో ఉన్న ఇళ్లపై దృష్టి పెట్టారు. తిరుమలహిల్స్‌ కాలనీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు సామ గణేష్‌రెడ్డి ఇంటిని ఎంచుకున్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో తిరుమల హిల్స్‌లోని వీధులన్నీ మధ్యాహ్నం సమయంలో నిర్మానుష్యంగా ఉన్నాయి. సామ గణేష్‌రెడ్డి ఇంటి తలుపులు తట్టడంతో ఆయన భార్య మాధవి తలుపులు తెరిచింది. తలుపులు తెరుస్తుండగా ముసుగు ధరించి ఉన్న అమరేందర్‌రెడ్డి భార్గవి ఒక్కమారుగా దాడికి పాల్పడుతూ మాధవి కళ్లలో కారం చల్లారు. దీంతో మాధవి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. ఇంతలో దోపిడీకి వచ్చిన అమరేందర్‌రెడ్డి, భార్గవి ఇంట్లోకి ప్రవేశించి బెడ్‌రూంలో ఉన్న బంగారు నగలను మూటగట్టుకుని పారియేందుకు ప్రయత్నించారు. అప్పటికే వారి ఇంట్లో ఉన్న కోడలు, పని మనిషి తేరుకుని అరవడంతో స్థానికులు అప్రమత్తమై మలక్‌పేట పోలీసులకు సమాచారమిచ్చారు. ఫోలీసులు హుటాహుటీన చేరుకొని అమరేందర్‌రెడ్డి, భార్గవిలను పట్టుకున్నారు. అనంతరం వారిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు మలక్‌పేట సీఐ గంగిరెడ్డి తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *