పట్టపగలే వెలుగుతున్న “వీధి దీపాలు”
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 03 : ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తుంటే మరో వైపు అధికారుల నిర్లక్ష్యంతో ఇష్టారీతిగా పగలనక, రాత్రనక వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. చేర్యాల మండల పరిధిలోని ఆకునూరు గ్రామంలో కొద్ది రోజుల నుంచి విద్యుత్ వీధి దీపాలు పగలనక, రాత్రనక వెలుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి కూడా సరిగా పనిచేయని వీధి దీపాలను పట్టించుకోని అధికారులు పగలు కూడా నిరంతరాయంగా వీధి దీపాలు వెలగడం చూసి ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మా గ్రామంలో రాత్రి వేళల్లో విద్యుత్ వీధి దీపాలు సక్రమంగా వెలిగితే చాలు పట్టపగలు అవసరం లేదని, అధికారులు నిర్లక్ష్యం వీడి వీధి దీపాలపై శ్రద్ధ వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.