పదకొండేళ్ల బాలుడు ఎనిమిదేళ్ల బాలికపై కాల్పులు
చికాగో: కుక్కపిల్లకోసం ఇద్దరు చిన్నారుల మధ్య తలెత్తిన గొడవ ప్రాణం తీసింది. పదకొండేళ్ల బాలుడు తన పక్కింట్లో ఉంటున్న ఎనిమిదేళ్ల బాలికపై కాల్పులు జరపడంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని టెన్నస్సీ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక తల్లి లటాషా ఈ ఘటనపై మాట్లాడుతూ తన కుమార్తె మెక్ కాయ్లా బయట పప్పీతో ఆడుకుంటుండగా ఓ పదకొండేళ్ల బాలుడు చూశాడు.
తనకు ఒకసారి పప్పీ ఇవ్వాలని కోరాడు. అందుకు ఆ పాప నిరాకరించడంతో ఆ బాలుడు ఇంట్లోకి వెళ్లి తన తుపాకీ తీసుకొచ్చి బాలిక ఛాతిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ పాప చనిపోయింది. అంతకుముందు రోజుల్లో కూడా ఆ బాలుడు తన కూతురుతో సరదాగా గడుపుతుండేవాడని, పలుపేర్లతో పిలుస్తూ ఏడిపిస్తుండేవాడని, కానీ, చివరికి ఇలాంటి ఘటనకు పాల్పడతాడని తాను అస్సలు ఊహించలేదని లటాషా వాపోయింది. తన కూతురు ప్రాణాలు తీసిన ఆ బాలుడు.. తన జీవితంలో ఏం తప్పు చేశాడో తప్పక తెలుసుకుంటాడని పేర్కొంది.