Thursday, 5 November 2026

పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు

హైదరాబాద్‌,జూలై18(జ‌నం సాక్షి): తెలంగాణలోని పర్యాటక కేంద్రాలను మరింతగా అభివృద్ది చేసి ఆకర్శణీయంగా తీర్చిదిద్దేలా ప్రణాలికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతికశా ఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ తెలిపారు. ప్రకృతిలోని అందానికి తోడు రమణీయ ప్రదేశాలను మరింత సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తామని అన్నారు.అదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలో ఉన్న వాటర్‌ఫాల్స్‌లలో టూరిజంను అభివృద్ధిద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. జలపాతాల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని పర్యాటకులకు తగిన సూచనలు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. గోదావరి, కృష్ణానది, నది పరివాహక ప్రాంతాల్లోని రమణీయ ప్రదేశాలను అభివృద్ధి చేస్తూ ఇప్పటికే ఎకోటూరిజంను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి పర్యాటక పరంగా పలు అభివృద్ధి పనులను చేపట్టాలని మంత్రి అధికారుల ను ఆదేశించారు. విదేశీ పర్యాటకులు తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించే విధంగా టూరిజం శాఖ వారు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే విదేశాల్లో సైతం తెలంగాణ పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. త్వరలోనే రామాయణ సర్యూట్‌లో భాగంగా భద్రాచలం ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ది పర్చనున్నట్లు మంత్రి తెలిపారు. భువనగిరి కోటను ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసే పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రామప్ప దేవాలయం వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, ఈ కేంద్రం నిర్మాణ పనులు పూర్తయితే అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులు వచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.