Wednesday, 4 November 2026

పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలకు కొత్త శోభ ఆహ్లాదాన్ని పంచుతున్న వనాలు సేద తీరుతున్న పల్లె ప్రజలు  పిల్లల ఆటల కోసం క్రీడా సామాగ్రి ఏర్పాటు

జనం సాక్షి /కొల్చారం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పల్లెన ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతూ కనువిందు చేస్తున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వ భూమి 20 గుంటలు ఉన్నచోట ఈ వనాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేని గ్రామాల్లో అటవీ భూములను సేకరించి పల్లె ప్రకృతి వనాలను పెంచారు. మూడేళ్ల క్రితం నాటిన మొక్కలు నేడు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. గ్రామపంచాయతీ నిధులతో అందులో పిల్లలు ఆడుకోవడానికి క్రీడా సామాగ్రిని సైతం ఏర్పాటు చేశారు. మొక్కల సంరక్షణ బాధ్యతలు వన సంరక్షణ సేవకులకు అప్పగించారు. కూర్చోవడానికి బెంచీలు సైతం ఏర్పాటు చేశారు. మొక్కలు ప్రకృతి వనాల వివరాలు తెలిపిన సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు రోజు సాయంత్రం ప్రకృతి వనలో సేద తీరుతూ ఉల్లాసం పొందుతున్నారు. 21 గ్రామాల్లో పచ్చని వనాలు: కొల్చారం మండల వ్యాప్తంగా 21 గ్రామ పంచాయతీలు ఉండగా అన్ని గ్రామాల్లో పల్లె ప్రకటనలు ఏర్పాటు చేశారు. ఒక్కోపల్లె ప్రకృతి వనానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఉపాధి హామీ నిధులు కేటాయించగా, మూడు లక్షల రూపాయలతో సామాగ్రి కొనుగోలు చేశారు. మరో రెండు లక్షల రూపాయలు కూలీల వేతనాల కోసం వెచ్చించారు. ఏపుగా పెరిగే మొక్కలను వనం చుట్టూరా నాటించారు. మధ్యలో వేప జామ కానుగా గుల్ మోహర్ లతో పాటు పూల మొక్కలు, ఔషధ మొక్కలను నాటారు. మూడు సంవత్సరాలుగా గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నీటిని అందించడంతో మొక్కలు ఏపుగా పెరిగి స్వచ్ఛమైన గాలి ఇస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో అందుబాటులో ఉన్న నిధులు, మరికొన్ని గ్రామాల్లో దాతల సహకారంతో పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన క్రీడా సామాగ్రిని అమర్చారు. ఉదయం సాయంత్రం వేళల్లో చిన్నా పెద్ద తేడా లేకుండా పల్లె ప్రకృతి వనంలో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నారు. పిల్లలు క్రీడా మైదానాలుగా ఉపయోగించుకుంటున్నారు. ముక్కల మధ్య నుంచి వేసిన వాకింగ్ టాక్ లను పెద్దలు వినియోగించుకుంటున్నారు. మండలంలోని పోతనశెట్టిపల్లి ఎనగండ్ల సీతారాంతాండ సంగాయిపేట పైతర అంశం పల్లి పోతిరెడ్డిపల్లి కొంగోడు గ్రామాల్లో మొక్కలు బాగా ఎదిగి ఆహ్లాదకర వాతావరణాన్ని ఇస్తుండగా పైతర పల్లె ప్రకృతి వనంలో క్రీడా సామాగ్రి అమర్చడంతో మండలంలోని ఆదర్శంగా నిలిచింది. కనువిందు చేస్తున్నాయి : పి విష్ణువర్ధన్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు. ఒకప్పుడు పట్టణాల్లోనే పార్కులు చూసాం. సీఎం కేసీఆర్ మూడేళ్ల క్రితం గ్రామాలను నందనవనాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నాడు నాటిన మొక్కలు ఏపుగా ఎదిగి నేడు వనాలను తల పిస్తున్నాయి. పల్లెకు కొత్త శోభను తీసుకొచ్చాయి. పచ్చదనంతో కూడిన ఆహ్లాద వాతావరణం లో చిన్నా పెద్ద తేడా లేకుండా ఉదయం సాయంత్రం సేద తీరుతున్నారు.