పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు..  కృతజ్ఞతలు తెలిపిన మోదీ


– కర్తార్‌పూర్‌ కారిడార్‌కు సహకరించటం సంతోషంగా ఉంది
– గురునానక్‌ దేవ్‌ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు
– ప్రధాని నరేంద్ర మోదీ
– కర్తాపూర్‌ కారిడార్‌ను ప్రారంభించిన మోదీ
ఛండీఘర్‌, నవంబర్‌9(జనం సాక్షి) : కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణం కోసం సహకరించిన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. పాక్‌ ప్రధానితో పాటు పంజాబ్‌ ప్రభుత్వం, ఎస్‌జీపీసీతో పాటు కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్‌ దేవ్‌ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించేందుకు శనివారం ఆయన పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్‌ లోధి వచ్చారు. డేరా బాబానానక్‌ను సందర్శించి ఇక్కడి ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టు (ఐసీపీ)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గురుబనీని ప్రపంచంలోని పలు భాషల్లోకి తర్జుమా చేస్తున్నామని, ఈ పనికి చొరవతీసుకున్న యునెస్కోకి కృతజ్ఞతలు తెలిపారు. గురు నానక్‌ దేవ్‌పై పరిశోధనలను ప్రోత్సహించేందుకు బ్రిటన్‌లోని ఓ యూనివర్సిటీ, కెనడాలోని మరో యూనివర్సిటీ కృషిచేస్తున్నాయని ప్రధాని  పేర్కొన్నారు. గురు నానక్‌ దేవ్‌కి సంబంధించిన అన్ని పుణ్య క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు
సేవలను ప్రారంభించనున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. అమృత్‌సర్‌, కేశ్‌ఘర్‌, ఆనంద్‌పూర్‌, డామ్‌డమ, పాట్నా, నాందేడ్‌లలోని సిక్కు పవిత్ర క్షేత్రాలను కలుపుతూ రైల్వేశాఖ కొత్త రైళ్లను నడపనున్నట్టు ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌, లద్దాక్‌లలో ఆర్టికల్‌ 370రద్దుతో సిక్కులకు విశేష లబ్ది చేకూరుతుందన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలంతా దేశ ప్రజలతో సమానంగా హక్కులను పొందుతారన్నారు. అంతకు ముందు పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్‌ లోధిలో ఉన్న బేర్‌ సాహిబ్‌ గురుద్వారాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  సందర్శించారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవంలో భాగంగా తొలుత ఆయన గురుద్వారాలో పూజలు చేశారు. గురుదాస్‌పూర్‌లోని డేరా బాబా నానక్‌ వద్ద భారత్‌ వైపున ఉన్న కారిడార్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనుండగా.. పాకిస్థాన్‌ వైపున ఉన్న కారిడార్‌ను ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రారంభించనున్నారు. ఇక్కడికి వెళ్లడానికి భారత పర్యాటకులకు వీసా అవసరం లేదు. ప్రారంభోత్సవం, గురునానక్‌ జయంతి రోజున వెళ్లే యాత్రికులు ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని పాకిస్థాన్‌ ఇప్పటికే ప్రకటించింది.