Wednesday, 4 November 2026

పాఠశాల విద్యార్థులకు మార్షల్‌ ఆర్ట్స్‌

హైదరాబాద్‌  : వేధింపులను అరికట్టేందుకు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థినులకు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. ‘చట్టం అమలులో మహిళ’ అనే అంశంపై నగరంలోని సర్దార్‌ పటేల్‌ పోలీస్‌ అకాడమీలో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా స్కైప్‌ ద్వారా ఆమె ప్రసంగించారు. పాఠశాల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వడానికి రాజస్థాన్‌, దిల్లీతో పాటు మరో రెండు రాషా్ట్రలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ మార్షల్‌ ఆర్ట్స్‌ తమను తాము రక్షించుకునేందు కవచంగా పనికొస్తాయన్నారు. తొలిసారి అంతర్జాతీయ మహిళా సదస్సును ఆస్ర్టేలియా చార్లెస్‌ స్టుర్ట్‌ యూనివర్సిటీ, ఎస్‌వీపీఎన్‌పీఏ సంయుక్తంగా నిర్వహించి విజయవంతం చేసినందుకు అభినందలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా పోలీసుల అధికారులందరినీ ఈ సదస్సులో ఒకే వేదికపై చూడడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోని యూనివర్సిటీల సహకారంతో ఇలాంటి సదస్సును నిర్వహిస్తే మరింత ప్రయోజనాత్మకంగా ఉంటుందన్నారు. చట్టాలను సమర్థవంతంగా అమలు చేసే మహిళా పోలీసుల మనోవికాసానికి ఇలాంటి అంతర్జాతీయ సదస్సులు నిర్వహించాల్సిన అవసరముం దన్నారు. ఎన్‌వీపీఎన్‌పీఏ డైరెక్టర్‌ అరుణ బహుగుణ మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా మహిళా అధికారులు తమ నాయకత్వ లక్షణాలను ఎలా మెరుగుపర్చుకోవాలో నేర్చుకున్నారన్నారు. ఆస్ర్టేలియా చార్లెస్‌ సుర్ట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ట్రేసీ గ్రీన్‌ మాట్లాడుతూ వృత్తిలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను అర్థం చేసుకొని వాటిని ఎలా అఽధిగమించడానికి అంతర్జాతీయ సంబంధాలు ఎంత ప్రధానమో ఈ సదస్సు తెలియపర్చిందన్నారు. తెలియని అనేక విషయాలు తెలుసుకోవడానికి సదస్సు ఉపయోగపడిందన్నారు. యూఎస్‌ఏకి చెందిన ఒన్‌లైప్‌ అల యన్స్‌ ప్రెసిడెంట్‌ కియస్కెర్‌ మాట్లాడుతూ 26/11 ముంబై దుర్ఘటనలో ఉగ్రవాదుల దుశ్చర్యకు తన భర్త అలన్‌, కుమార్తె నోమి ఎలా బలయ్యారో ఉద్వేగంగా వివరించారు. ఇలాంటి దాడుల్ని నివారించడానికి సామరస్య సంబంధాలను సానుకూల దృక్పథంలో అలవర్చుకోవడానికి తమ సంస్థ నిరంతరం శ్రమిస్తుందన్నారు. బంగ్లాదేశ్‌ పోలీసు అధికారి ఫాజియా ఖోండ్‌కర్‌ మాట్లాడుతూ బంగ్లాదేశ్‌ పోలీసు బలగాల్లో మహిళ సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. సదస్సులో హైదరాబాద్‌ క్రైమ్స్‌ అడిషనల్‌ కమిషనర్‌ స్వాతి లక్రా, మల్కాజ్‌గిరి డీసీపీ రమారాజేశ్వరితో పాటు పలు దేశాలకు చెందిన మహిళా పోలీసు అధికారులు, ఎస్‌వీపీఎన్‌పీఏ డిప్యూటీ డైరెక్టర్‌ పాల్‌సన్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *