Tuesday, 3 November 2026

పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు 10శాతం రాయితీ

పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ప్రోత్సాహం
మహిళా పారిశ్రామిక పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌
సంగారెడ్డి,మార్చి8(జనం సాక్షి): రాష్ట్రంలోని మహిళా పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు 10శాతం పెట్టుబడి రాయితీ ఇస్తామని, వారు ఎదగడానికి సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటును అందిస్తుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సుల్తాన్‌పూర్‌లో మహిళా పారిశ్రామిక పార్కును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసిన ప్లో ఇండస్టియ్రల్‌ పార్క్‌ పైలాన్‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. దేశంలో తొలిసారి మహిళా పారిశ్రామికవేత్తల కోసం
ఉద్యామిక అనే కొత్త కార్యక్రమం చేపట్టామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. వారి ఫిర్యాదులను కూడా పరిష్కరిస్తున్నా మని చెప్పారు. ఉద్యామికలో భాగంగా సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ ద్వారా ప్రాసెస్‌, రివ్యూ, ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. సులభతర వాణిజ్యానికి కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు కావాలన్నారు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులతో పురోభివృద్ధి సాధించాలని ఆశిస్తున్నాను అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతి ఇస్తున్నామని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వీ హబ్‌ అని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన వీ హబ్‌కు సీఈవోగా దీప్తి ఉన్నారు. వీ హబ్‌ సందర్శించి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. వీ హబ్‌ ఇప్పటికే 2,194 స్టార్టప్‌లను రూపకల్పన చేసింది. ఇందు కోసం రూ. 66.3 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. స్టార్టప్‌ నిధులతో 2,800 మందికి ఉపాధి కల్పన సృష్టించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 18 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. ప్రయివేటు రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన కల్పించామన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించే కేంద్రంగా హైదరాబాద్‌ మారిందన్నారు. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, హెల్త్‌ కేర్‌ రంగంతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ ఫార్మాస్యూటికల్‌ ఆఫ్‌ ఇండియాగా మారిందని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ ఆర్ధికంగా ఎదుగుతూ దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చడంలో 4వ స్థానంలో నిలవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. హైదరాబాద్‌ ప్రపంచ వాక్సిన్‌ కేంద్రంగా ఎదిగిందని.. హైదరాబాద్‌ ఇప్పుడు ఇండియా బల్క్‌ డ్రగ్‌ కేంద్రం, ఫార్మా రాజధాని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందన్నారు. సరికొత్త ఆలోచనలతో ప్రగతి పథంలో ముందుకు వెళ్లే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు. అవసరమైతే మహిళా పారిశ్రామికవేత్తల కోసం మరోక వంద ఎకరాలు కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొత్త పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ఆర్థికంగా అన్ని వర్గాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిరంతరం పారదర్శకంగా పనిచేస్తుందని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు