Wednesday, 4 November 2026

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కు ఢిల్లీ పిలుపు?

దానం రాజీనామాతో పార్టీలో ఉలికిపాటు

తక్షణ చర్యలకు ఉపక్రమించిన ఎఐసిసి

హైదరాబాద్‌,జూన్‌23(జ‌నం సాక్షి): తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఉత్తమ్‌ శనివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వార్‌ రూమ్‌ లో కాంగ్రెస్‌ సీనియర్లు ఉత్తమ్‌ తో సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి దానం నాగేందర్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఉత్తమ్‌ హైకమాండ్‌తో చర్చించునున్నట్టు తెలుస్తోంది. అలాగే కొత్త కమిటీ ఏర్పాటు, సంస్థాగత మార్పులపై చర్చించే అవకాశం ఉంది. పిసిసిలో మార్పులు, బిసిలకు అన్యాయం వంటి అంశాలపైనే చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌ రాజీనామాతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా సవిూక్షించుకొనే వ్యవహారాన్ని కాంగ్రెస్‌ చేపట్టింది. పార్టీలో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించేందుకు సీఎల్పీ నేత జానా రెడ్డి నివాసంలో ఆ పార్టీ ముఖ్యనేతలు ఉత్తమ్‌, వీహెచ్‌, షబ్బీర్‌ అలీ, తదితరులు భేటీ అయ్యారు. ఎన్నికలు సవిూపిస్తున్న వేళ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కుంతియా నేతృత్వంలో పనిచేసేందుకు మరో ముగ్గురు కార్యదర్శులను తెలంగాణకు నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే సీనియర్‌ నేత దానం ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పార్టీ సీనియర్‌ నేతలంతా కలిసి దిల్లీకి వెళ్లి నాయకత్వ మార్పుపైనా కొన్ని ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో దానం రాజీనామా ఘటనతో పాటు మరో ఇద్దరు కీలక నేతలు కూడా తెరాసలో చేరతారంటూ వస్తోన్న వార్తలు కాంగ్రెస్‌లో అంతర్మథనానికి దారితీశాయి. ఇంకా ఎవరెవరు పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్నారనే అంశంతో పాటు చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలు, పార్టీ బలోపేతం,క్యాడర్‌లో విశ్వాసం ఎలా నింపాలనే దానిపై జానా నివాసంలో కీలకంగా చర్చించినట్టు సమాచారం. ఈ దశలో ఉత్తమ్‌కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ఇప్పుడు గాందీభవన్‌లో చర్చగా మారింది.