Tuesday, 3 November 2026

పూర్తి కావస్తున్న బంజారా భవన్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): స్వరాష్ట్రంలో బంజారాలకు మహర్ధశ పడుతోంది. సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చినట్లుగా హైదరాబాద్‌ లోనే ఖరీదైన ప్రాంతం బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 10లో బంజారా భవన్‌ నిర్మిస్తోంది. ఎకరం విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనానికి 2014 డిసెంబర్‌ 11న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ. 20 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న బంజారా భవన్‌ నిర్మాణం అత్యంత వేగంగా కొనసాగుతోంది. నిధుల కేటాయింపుతో పాటు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా చొరవ తీసుకోవడంతో మరికొద్ది నెలల్లో బంజారా భవన్‌ పూర్తి కానుంది. ఇప్పటికే సగం పనులు పూర్తి అయ్యాయి. మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవన్‌ లో బంజారా విద్యార్థులకు వసతి గృహంతో పాటు కాన్ఫరెన్స్‌ హాల్‌, భోజన శాల ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు బంజారాలకు సంబంధించిన కీలక వేడుకలన్ని ఇందులోనే జరిగేలా భవనాన్ని నిర్మిస్తున్నారు. బంజారా భవన్‌ నిర్మాణ కలను సాకారం చేసిన సీం కేసీఆర్‌ పై బంజారాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తమ ఆత్మగౌరవాన్ని పెంపొందించిన సీఎం కేసీఆర్‌ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.ఇన్నాళ్లు తండాలకే పరిమతమైన తమ కష్టాలు బంజారాభవన్‌ నిర్మాణంతో తీరుతాయని బంజారా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బంజారా భవన్‌ పక్కనే ఆదివాసి భవన్‌, బాబూ జగ్జీవన్‌ రాం భవన్‌ నిర్మాణాలు సైతం శరవేగంగా పూర్తి అవుతున్నాయి.