Monday, 2 November 2026

పెళ్లి ఫోటోలివ్వలేదని హార్డ్ డిస్క్‌ల చోరీ!

– పెళ్లి ఫొటోల ఆల్బమ్స్‌ ఇవ్వలేదు

– స్టూడియో నుంచి హార్డ్‌డిస్క్‌లు దొంగిలించారు
– పరస్పర ఫిర్యాదుపై కేసు నమోదు
పంజాగుట్ట: పెళ్లి ఫొటోలు, వీడియో తీసి నెలలు గడుస్తున్నా ఆల్బమ్స్‌, సిడీలు ఇవ్వడం లేదని వినియోగదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తమ దుకాణానికి వచ్చి కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు ఎత్తుకెళ్లారంటూ స్టూడియో యజమాని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరి ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హెచ్‌ఎంటీ హిల్స్‌లోని లక్ష్మి గాయత్రి ఎన్‌క్లేవ్‌కు చెందిన కృష్ణ దీప్‌ సోదరి దివ్యకు గత సంవత్సరం ఆగస్టు వివాహం జరిగింది. ఫొటోలు, వీడియో తీయడానికి పంజాగుట్ట, ద్వారకాపురి కాలనీలోని ఫుటోస్‌ ఫొటో స్టూడియో డైరెక్టర్‌ అన్వేషను కృష్ణదీప్‌ సంప్రదించారు. పెళ్లి, రిసెప్షన్‌కు గాను ఫొటోలు, వీడియో తీయడానికి 6.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అన్వేష తెలిపారు. ఆల్బమ్స్‌, సిడీలను ఇస్తామని చెప్పారు. దీనికి కృష్ణదీప్‌ అంగీకరించి 4 లక్షల రూపాయలను అడ్వాన్స్‌గా చెల్లించాడు. మిగతా డబ్బును ఆల్బమ్స్‌, వీడియో సీడీలు ఇచ్చిన తరువాత ఇస్తామని చెప్పాడు. దీనికి ఆమె అంగీకరించింది. పెళ్లి జరిగి 8 నెలలు గడుస్తున్నా అన్వేష ఆల్బమ్స్‌, వీడియో సీడీలను ఇవ్వలేదు. ఈ విషయమై కొంతకాలంగా కృష్ణదీప్‌ ఆమెను అడుగుతున్నా రేపు, మాపు అంటూ దాటవేస్తోంది. రెండు రోజుల క్రితం కృష్ణదీప్‌ నిలదీశాడు. ఫలితం లేకపోవడంతో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కృష్ణదీప్‌ తమ స్టూడియోకు వచ్చి రెండు కంప్యూటర్లు, 7 హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లాడంటూ అన్వేష పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *