పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం

 

అపదలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ వరం లాంటిది

– మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ప్రజలకు మంత్రి సిఫార్స్ ద్వారా వచ్చిన సిఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు మంత్రి అందజేశారు.నియోజకవర్గ వ్యాప్తంగా 335 మంది ఒక కోటి 45 లక్షల రూపాయల చెక్ లను జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కార్య్రమంలో మంత్రి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వరంగా మారిందన్నారు.సీఎం కేసీఆర్‌ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.సీఎం కేసీఆర్‌ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు.సీఎం సహాయనిధి, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి నిరుపేదల పాలిట వరంగా మారాయన్నారు. సీఎం సహాయనిధితో పేదలు కార్పొరేట్‌ వైద్యాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు.గత ప్రభుత్వాలలో కూడా సీఎం సహాయనిధి ఉండేదని, అప్పుడు ఆపదలో ఉన్న వారి అందరికీ అందేది కాదన్నారు.తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ చొరవతో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం సహాయనిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.పేదవాడి ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న సిఎం కేసీఆర్ కు ప్రజలు తోడుగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితా ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్లు,నియోజకవర్గానికి చెందిన ఎంపిపి, జడ్పీటిసిలు, సర్పంచ్లు ఎంపిటిసిలు, గ్రామ , వార్డ్ ల అధ్యక్షులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.