రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్
– పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ ఆగస్టు 30 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్షీ, షాదీముబారక్, పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలుచేస్తోందని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని వర్తక సంఘం భవనంలో హుజూర్ నగర్ పట్టణ, మండలానికి చెందిన 111 మంది లబ్ధిదారులకు ఒక కోటి పదకొండు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలు (11,112,876) కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామగా, అన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిళ్ల భారాన్ని తగ్గిస్తున్నారని ఆయన అన్నారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని అన్నారు. ప్రతీ పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా 1,00,116 /- ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని చెప్పారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదని కేవలం టీఆర్ఎస్ సర్కార్ మాత్రమే అమలు చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని వారు తెలిపారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ లోన్ ద్వారా మంజూరైన కుట్టు మిషన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథరెడ్డి, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, కౌన్సిలర్లు కుంట ఉపేంద్రసైదులు, ఫణి కుమారి, రాం గోపి, వివిధ మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




