హైదరాబాద్: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, భార్య, కుమారుడు అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య ఇంట్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు సారికతో పాటు మనవళ్లు అభివన్(7), యోన్(3), శ్రీయోన్(3)లు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై తమకు అనుమానం ఉందంటూ సారిక కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు రాజయ్యతో పాటు ఆయన భార్య, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రాజయ్య ఇంటి ఎదుట మహిళల ఆందోళన
రాజయ్య ఇంటి ఎదుట బుధవారం మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. అగ్నిప్రమాద ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటామని తెలిపారు.




