పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
-కలెక్టర్ శశాంక
-ఎస్పీ శరత్ చంద్ర పవార్
మహబూబాబాద్ బ్యూరో-అక్టోబర్21(జనంసాక్షి)
శాంతి, సామరస్యం పరిడవిల్లినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. అక్టోబర్ 21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో జిల్లా కలెక్టర్ పాల్గొని పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీస్ శాఖలో పనిచేస్తూ ఎన్నో ఒడి దిడుగులను ఎదుర్కొని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరులకు ఘన నివాళులు అర్పించడంతోపాటు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పోలీసు శాఖ ప్రధాన భూమిక పోషించిందని, శాంతి సామరస్యాన్ని కాపాడుతున్నది కాబట్టే తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, మారుతున్న సమాజంలో భాగంగా టెక్నాలజీలో వచ్చిన మార్పుల దృష్ట్యా పోలీసు శాఖ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, గతంలో సంఘవిద్రోహక శక్తుల నుండి మాత్రమే సవాళ్లు ఎదురయ్యేవని,
సైబర్ ఎటాక్ ద్వారా టెక్నాలజీకి సంబంధించిన ఇతర అంశాల ద్వారా అనేక సవాళ్లను పోలీస్ శాఖ ఎదుర్కొంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. మారుతున్న పరిస్థితులను తెలంగాణ పోలీస్ అస్సెస్ చేసుకుంటూ దేశంలోనే అత్యున్నత పోలీసుగా మన్నలను పొందుతుందని కలెక్టర్ అన్నారు.
ఖాకీ యూనిఫామ్ త్యాగానికి, సేవకు ప్రతీకగా నిలుస్తుందనీ, కర్తవ్యాన్ని నిర్వర్తించడంతోపాటు సమాజానికి తోడ్పాటు అందించడంలో పోలీస్ శాఖ ముందంజలో ఉంటుందని కలెక్టర్ అన్నారు. పోలీస్ శాఖ వివిధ విభాగాల పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో అందిస్తున్న సేవలపట్ల కలెక్టర్ అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటామనీ, భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతం, అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిందని దేశవ్యాప్తంగా విధినిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైందనీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బలగాలు నిర్వర్తించేవనీ, 1959 అక్టోబరు 21న డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచెన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ జవాన్లు హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదుర్కొని పోరాడిందనీ,
ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారనీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ పవిత్రస్థలంగా రూపు దిద్దుకున్నదనీ,ప్రతి ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం అమరులైన పోలీసుల జీవితాలను మనం మార్గదర్శకంగా, ఆదర్శంగా మలుచుకుంటు ప్రజాసేవకు, ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణకు పునరంకితం కావడమని, ఉగ్రవాదం, నక్సలిజం వంటి విచ్చిన్నకర శక్తులతో నేరాలకు ఘోరాలకు పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడవలసి రావడంతో పోలీసు ఉద్యోగం కత్తిమీద సాము లాగ ఎంతో ప్రమాదకరంగా పరిణమించిందనీ,
ఈ దశలో త్యాగాలకు భయపడకుండా వెనుకడుగు వేయకుండా రెట్టించిన సమరోత్సాహంతో అసాంఘిక శక్తులతో పోరాడి విజయాన్ని సాధించడం జరిగిందనీ, మనం సంఘ వ్యతిరేకులు క్రూరమైన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామనీ ఎస్.పి.అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారులు కె.ఎస్. వ్యాస్, సి.ఉమేష్ చంద్ర, శ్రీ పరదేశి నాయుడు లాంటి చాలామంది పోలీసులు మనకోసం ప్రాణత్యాగం చేశారనీ, ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా (264) మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైనారనీ, తమ జీవితాలను త్యాగం చేసి మన దేశ ఐక్యతను, శాంతి భద్రతలను సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు తీవ్రవాదుల దాడుల నుండి రక్షించారనీ, వారికి ఈవిధంగా ఘన నివాళి అర్పిస్తున్నామనీ, వారి అమూల్యమైన త్యాగాలను మనం మరచిపోకూడదనీ, వారి త్యాగాల వల్ల మన జాతి గర్వం చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. అనంతరం పోలీస్ విధులలో ప్రాణాలను అర్పించిన వారి పేర్లు చదివి వారిని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మరో అదనపు కలెక్టర్ ఎమ్.డేవిడ్, మహబూబాబాద్ డిఎస్పీ సదయ్యా, తొర్రూరు డిఎస్పీ రఘు, డిఎస్పీ రమణ బాబు, ఏ.అర్ డిఎస్పీ జనార్ధన్ రెడ్డి, అర్.ఐ నరసయ్య,లాల్ బాబు,
పూర్ణ చందర్, సిఐలు, ఎస్.ఐలు,
సిబ్బంది పాల్గొన్నారు.