హైదరాబాద్,మే30(జనం సాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రగతిభవన్‌కు బయల్దేరిన గ్రూప్-2 అభ్యర్థులను పోలీసులు మధ్యలోనే అరెస్టుచేశారు. వారు ప్రగతిభవన్ ముట్టడించే అవకాశాలు ఉన్నాయన్న అనుమానంతో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కోర్టు కేసుల జాప్యం కారణంగా తమ ఉద్యోగాల నియామక పక్రియ ఆగిపోయిందని… దీంతో తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ వచ్చి రెండున్నరేళ్లు గడిచిందని… పరీక్ష రాసి ఏడాదిన్నర గడిచిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం జూన్ 2న ఫలితాలు ప్రకటించారని… అప్పటి నుంచి ఇప్పటివరకు ఉద్యోగాల కల్పన జరగలేదన్నారు. అడ్వకేట్ జనరల్‌ను నియమించి.. కోర్టు కేసులను సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ సాధనలో తాము భాగస్వాములు కావాలని ఉందని… ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తమ సమస్య పరిష్కరించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. అయితే సిఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతుండగా ఎందుకు అరెస్ట్ చేస్తారని వారు ప్రశ్నించారు. దీంతో కొంత ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.




