Wednesday, 4 November 2026

ప్రజల్లో తిరగలేక పోతున్నాం

– సభ్యత్వం రద్దుపై సానుకూల తీర్పు వచ్చినా సరిగా స్పందించలేదు
– కనీసం గన్‌మెన్‌లను పునరుద్దీకరణపై డీజీపీని కలవలేదు
– సీఎల్పీ సమావేశంలో సంపత్‌ అసంతృప్తి
– సభ్యత్వాల రద్దుపై అన్ని నియోజకవర్గాల నిరసన చేశామన్న జానా
– ప్రభుత్వం తీరును ప్రజల్లో ఎండగట్టగలిగామని వెల్లడి
– సంపత్‌ వ్యాఖ్యలను సమర్థించిన పలువురు నేతలు
– స్పీకర్‌, డీజీపీ, చీఫ్‌ సెక్రటరీలను కలిసి కోర్టు తీర్పు కాపీని అందజేయాలని నిర్ణయం
హైదరాబాద్‌, మే5(జ‌నం సాక్షి ) : పార్టీ వ్యవహరిస్తున్న తీరు కారణంగా ప్రజల్లో తలెత్తుకు తిరగలేకపోతున్నామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ సీఎల్సీ సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి నివాసంలో శనివారం సీఎల్పీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భట్టివిక్రమార్క, సంపత్‌కుమార్‌, జీవన్‌రెడ్డి, పద్మావతి, వంశీచంద్‌రెడ్డి, ఆకుల లలిత తదితరులు హాజరయ్యారు. మరోవైపు ఎమ్యెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికాలో ఉన్నందున ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఇదిలా ఉంటే సమావేశంలో నేతల మధ్య హాట్‌హాట్‌గా చర్చ సాగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా శాసనసభాపక్షం సరిగా స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని సంపత్‌ నేతలను నిలదీసినట్లు తెలిసింది.  సీఎల్పీ తీరు వల్ల ప్రజల్లో తిరుగలేక పోతున్నట్లు సహచర సభ్యులతో సంపత్‌ చర్చించారని చెబుతున్నారు. కనీసం గన్‌మెన్‌ల పునరుద్ధీకరణపై డీజీపీని కూడా కలవలేదని నేతల తీరుపై సంపత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన జానా మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దుపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించామని, రాష్ట్ర ప్రభుత్వం తీరును ప్రజల్లో ఎండగట్టగలిగామన్నారు. కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా తెరాస ప్రభుత్వం అహంకారపూరితంగా ముందుకెళ్తుందని దీనిపై ప్రజలు తెరాస పట్ల ఆగ్రహంతో ఉన్నారని జానా పేర్కొన్నారు. సభ్యత్వాల రద్దుపై పార్టీ సరిగానే స్పందించిందని తెలపడంతో కలుగజేసుకొన్న సంపత్‌ జానా వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతో జానా సీఎల్పీలోని సభ్యులతో పలు అంశాలపై కూలంకుశంగా చర్చించినట్లు సమాచారం. దీంతో త్వరలో స్పీకర్‌, డీజీపీ, చీఫ్‌ సెక్రటరీలను కలిసి కోర్టు తీర్పు కాపీని అందజేయాలని సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే  రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, నేతలంతా నష్టపోయిన పంటపొలాలను పరిశీలించి రైతులకు అండగా నిలవాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలని, పరిహారం అందించకపోతే మండలాలు, నియోజకవర్గాల వారీగా ఆందోళన ఉదృతం చేసేలా సీఎల్పీ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఇదిలాఉంటే మరో వైపు సీఎల్పీ సమావేశం నిర్వహణపై పలువురు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకూ సీఎల్పీ సమావేశం ఇళ్లలో జరగలేదంటూ కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌ దాటడని విమర్శించే తాము ఇంట్లో సీఎల్పీ సమావేశాలు జరపడమేంటని కొందరు నేతలు ప్రశ్నించారట. ఇదే అంశాన్ని పలువురు జానారెడ్డితో
నేరుగా చెప్పినట్టు తెలుస్తోంది.