ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు తరలినబిజెపి శ్రేణులు
* వాహన శ్రేణిని జెండా ఊపి ప్రారంభించిన గంగాడి
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు కరీంనగర్ జిల్లా నుండి అశేష సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలి వెళ్లారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఆర్ట్స్ కళాశాలమైదానంలో తలపెట్టిన సభకు కరీంనగర్ జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల నుండి బిజెపి శ్రేణులు, ప్రజలు అశేష సంఖ్యలో తరలి వెళ్లారు. కరీంనగర్ జిల్లా బిజెపి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాహన శ్రేణిని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి అవతరించిందని , బిజెపి కి ప్రజల్లో వస్తున్న ఆదరణను టిఆర్ఎస్ జీర్ణించుకోలేక , తట్టుకోలేక దిక్కుమాలిన రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజా సంగ్రామ యాత్ర, హనుమకొండలో తలపెట్టిన సభకు అనేక అడ్డంకులు అవరోధాలు సృష్టించిన చివరికి ధర్మం, న్యాయం గెలిచిందన్నారు .బిజెపి జాతీయ నాయకత్వం తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టి తగిన కార్యచరణతో ముందు కొనసాగుతుందన్నారు . ముఖ్యంగా కెసిఆర్ కుటుంబ పాలనలో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి కోసం, తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ , రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చి, నిరంకుశ నియంతృత్వ విధానాలతో రాజ్యమేలుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బిజెపి డబల్ ఇంజన్ సర్కార్ తీసుకురావడమే లక్ష్యంగా బిజెపి అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా చెప్పారు .
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, గుర్రాల వెంకట్ రెడ్డి, మాడుగుల ప్రవీణ్, కటకం లోకేష్, గంగిశెట్టి రాజు, రాముల కుమార్, పైళ్ళ వెంకట్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, తూర్పాటి రాజు, దేవేందర్రావు, అనురాగ్, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.