ప్రజా సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే –
జనం సాక్షి : నర్సంపేట.
ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని బిజెపి చేపట్టిన పర్యటనతో ప్రజల నుండి వచ్చిన స్పందన చూసి భయపడి పాత వాగ్దానాలను కొత్తగా ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు.
ఆదివారం నర్సంపేట పట్టణంలోని నియోజకవర్గ బిజెపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీ రేవూరి మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి నేను నా బృందం కాలనీలను సందర్శించి ప్రజల ఇబ్బందులను బహిర్గతం చేయడంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందని అన్నారు.
గత ఎన్నికల ముందు 2018లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కాలనీలలో సి సి రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని, సుమారు 35 కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తామని, రింగ్ రోడ్డు నిర్మాణం పనులు చేపడతామని నర్సంపేట పట్టణాన్ని సుందరీకరణ చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చి గెలిచిన తర్వాత నాలుగు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ ఎలాంటి హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
ఇటీవల మేము ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు చేపట్టిన పర్యటన ద్వారా ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా చూపడంతో వచ్చే ఎన్నికలలో ఎక్కడ తనకు బుద్ధి చెప్తారొనని భయపడి హడావుడిగా మున్సిపల్ సమావేశం నిర్వహించి గతంలో చేసిన ప్రతిపాదనలను తిరిగి కొత్తగా ప్రతిపాదనలు పంపుతూ కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు చేపడతామని, రింగ్ రోడ్ నిర్మాణం చేపడతామని తీర్మానాలు చేయించి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి దివాలా కోరు రాజకీయతనానికి నిదర్శనమని రేవూరి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నర్సంపేట అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే 2014లో ఎన్నికల ముందు జూరాల నుంచి పాకాలకు నీరందిస్తామని, చెరువులు వాగులు అన్ని అనుసంధానం చేస్తామని, ధర్మారం నుండి నర్సంపేట వరకు ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తామని, మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని అలాగే గత 2018 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో ఎన్ని పనులు మంజూరు చేశారో ఎన్ని నిధులు కేటాయింపు చేశారో ప్రజల ముందు పెట్టాలని శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు.
ముందస్తు ఎన్నికలు వస్తాయనే భయంతోనే ప్రజలను మరోసారి మభ్య పెట్టేందుకు పాత వాగ్దానాన్ని కొత్తగా ఇస్తున్నట్లు ప్రకటించుకున్నారని వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని ఎన్ని జిమ్మిక్కులు చేసినా టిఆర్ఎస్ ను, మిమ్మల్ని ప్రజలు నమ్మరని రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.