Tuesday, 3 November 2026

ప్రజా సమస్యలపై సుమన్ స్వరం..!

పరిష్కరించేందుకు కృషి చేయాలని కార్పొరేటర్ విన్నపం
మేడిపల్లి – జనంసాక్షి
తన డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కార్పొరేటర్ సుమన్ నాయక్ గళమెత్తారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశంలో డివిజన్లోని పలు సమస్యలను ఆయన కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను త్వరగా పరిష్కరించాలని, గతంలోలాగా రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా చేయాలని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బి అధికారులను కోరారు. డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో భారీ వర్షాలకు గుంతలు పడిన రోడ్లకు ప్యాచ్ వర్క్స్ చేయించాలని, మిగిలిన నాలా పనులను వెంటనే పూర్తి చేయాలని, నాలా ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని అన్నారు. కట్ట మైసమ్మ వైన్స్ కి వచ్చే వాహనాలు రోడ్డుపై పార్క్ చేయడం, రద్దీ వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సంబంధిత వారిపై  తగు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో తీర్మానించిన సాయిబాబా టెంపుల్ నుండి చిల్కానగర్ వరకు గల రోడ్డు వైడినింగ్ పనులు ప్రారంభించాలని, కల్వర్టు వెడల్పు పనులు ప్రారంభించాలని కౌన్సిల్ దృష్టికి తెలియపరిచారు. డివిజన్ పరిధిలోని ప్రతి పార్క్ కి కాంపౌండ్ వాల్స్ తో పాటు అభివృద్ధి చేయాలని కోరారు. సిమెంట్ గోదాం నుండి వచ్చే దుమ్ము వలన అక్కడి కాలనీ ప్రజలు రోగాలభారిన పడుతున్నారని, వెంటనే తగు చర్యలు చేపట్టాలని విన్నవించారు. అదేవిధంగా డివిజన్లోని పలు సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లగా.. కార్పొరేటర్ సుమన్ వివరించిన సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని మేయర్, కమిషనర్ హామీ ఇచ్చారు.