Tuesday, 3 November 2026

” ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు పూర్తిగా విఫలం – బిజెపి నేత గజ్జల యోగానంద్ “

శేరిలింగంప‌ల్లి, మార్చి 06( జనంసాక్షి) తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని గద్దెనెక్కిన టిఆర్ఎస్ పాలకులు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి స్వామి కార్యం, స్వకార్యం అన్నచందంగా ప్రజాధనం దోపిడికి అలవాటు పడ్డారని… ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారని శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి కన్వీనర్ గజ్జల యోగానంద్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం మియాపూర్ డివిజన్ భాజపా అధ్యక్షులు మాణిక్యరావు ఆధ్వర్యంలో చేపట్టిన భక్తి బాట కార్యక్రమంలో యోగానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధి ఎం. ఎ నగర్ లో పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో స్థానికులనుండి పెద్ద ఎత్తున సమస్యలపై వినతులు వెల్లువెత్తాయని వారన్నారు. డివిజన్ పరిధిలో కొన్నిచోట్ల ఇప్పటికీ సిసి రోడ్లు వేయడం మరిచిపోయారని, రక్షిత మంచి నీరు చాలా ప్రాంతాల్లో అనుకున్న మేర దొరకడం లేదని, మరికొన్ని చోట్ల సిసిరోడ్ల నిర్మాణం చేపట్టి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకుండా వదిలేశారని గజ్జల దుయ్యబట్టారు. చాలా ప్రదేశాలలో రోడ్లపైనా, ఖాళీ ప్రదేశాలలో మురుగునీరు ఎక్కడికక్కడ ప్రవహిస్తుండడంతో దుర్గంధానికితోడు తీవ్రమైన దోమలబెడద ఉందని కాలనీవాసుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తడం తెరాస పాలనకు అద్దం పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేస్తానని, హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినహామీలు బుట్టదాఖలై తెలంగాణ ప్రజలకు కుచ్చుటోపి పథకాలు మొదలు పెట్టడం సిగ్గుచేటన్నారు. దశాబ్దాలుగా మురికివాడలు, నిరుపేదలు నివసించే బస్తీలలో ఇళ్ల పట్టాలను అందజేయాల్సిన బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ మర్చిపోయారని, అడ్డగోలు కాంట్రాక్టులు, పైరవీలతో కోట్లు దండుకోవడం షరా మామూలే అయిందన్నారు. డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు మాట్లాడుతూ  బిజెపి ప్రజల విషయంలో తీసుకుంటున్న కార్యక్రమాలకు తెరాస పాలకులకు ముచ్చెమటలు పడుతున్నాయని, తాము ఆదివారం పర్యటించనున్న న్యూ కాలనీ లో శనివారమే ఎమ్మెల్యే తదితరులు కార్యక్రమాలను పెట్టుకోవడం నిదర్శనమని గజ్జల ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బి.జె.పి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి.ఆర్.కె ప్రసాద్, జిల్లా ఓబిసి మోర్చా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్, జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి, ఉపాధ్యక్షులు ఎన్. రత్నకుమార్, కె. మనోహర్, హఫీజ్పేట్ నాయకులు శ్రావణ్, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రెటరీ జిఎస్ రామకృష్ణారెడ్డి, ఆకుల లక్ష్మణ్, గీత సెల్ కన్వీనర్ రవి గౌడ్ ఇతరులు పాల్గొన్నారు.