ప్రణాళికతో సమస్యల అధిగమిస్తున్నాం

 మున్సిపల్ కమిషనర్ గుండె బాబు.
14 జూలై( జనంసాక్షి )
 వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ప్రణాళిక బద్ధంగా పరిష్కరిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ గుండె బాబు తెలిపారు. గత వారం రోజులుగా
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాలనీలన్నీ జలమయమైన తరుణంలో గురువారం పట్టణంలోని 13వ వార్డులోని పరిసరాలను స్థానిక కౌన్సిలర్ గుగులోతు శంకర్ తో కలిసి పరిశీలించారు. హరితహారం లో భాగంగా రోడ్డుకి ఇరువైపులా నాటే మొక్కల సిబ్బందికి సూచనలు ఇచ్చారు. రెండు లేయర్లు మొక్కలు నాటాలని తెలిపారు. పూలు నీడనిచ్చే మొక్కలు నాటాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ
ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుందని,దీంతో కాలనీలో నీరు నిలుస్తున్నాయని తెలిపారు. సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక బృందాలు, వాహనాలు, కార్మికులను ఏర్పాటు చేశామన్నారు.నీరు నిలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.నీరు నిలవకుండా సాధ్యమైన ప్రాంతాల్లో పైపులైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. సాధ్యం కాని పక్షంలో ఎప్పటికప్పుడు నీటిని పంప్‌ చేసేందుకు మోటార్లు ఏర్పాటు చేస్తామన్నారు.భవిష్యత్ లో ఇలాంటీ పరిస్థితులు తలెత్తకుండా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
ఖాళీ ప్లాట్ లలో నీరు నిలవకుండా సంబంధిత ఓనర్లు నీటి తొలగింపు,   చెత్త తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు.ఖాళీ ప్లాట్లలో నీరు నిలవడంతో దోమలు విజృంభిస్తున్నాయని,అపరిశుభ్రత నిలుపుకొని పందులు స్వైర విహారం చేస్తాయన్నారు.పుర పాలక చట్టం ప్రకారం కాలి స్థలాల్లో ఎలాంటి ముళ్లపొదలు పెరగకుండా, మురుగు,అపరిశుభ్రత లేకుండా ఓనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు ప్లాట్లను కొని రిజిస్ట్రేషన్ చేసుకుని వదిలి వేస్తున్నారని, ఆ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి, మురుగు పేరుకుపోయి అధ్వాన్నంగా మారుతున్నాయన్నారు.మున్సిపాలిటీ ఆదేశాలు పట్టించుకోని యజమానులకు నోటీసులు పంపిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఏఈ రంజిత్,స్థానికులు గుగులోతు రమేష్, గుంజి రవి  తదితరులు పాల్గొన్నారు.