శేరిలింగంపల్లి, అక్టోబర్ 08( జనంసాక్షి): ఈ భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి తన జీవిత సాఫల్యం, సార్ధకతకోసం నిజాయితీగా కృషిచేయాలని… అప్పుడే దానికి అర్థం, పరమార్థం లభిస్తుందని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, శేర్లింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ గజ్జల యోగానంద్ అన్నారు. ఈమేరకు శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధి చిత్తారమ్మ దేవాలయంలో శనివారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాపిరెడ్డి నగర్ కాలనీలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పుట్టడం ఒక్కటే గొప్ప కాదని, పుట్టిన ప్రతివ్యక్తి జీవిత సార్ధకతకు మార్గాలను అన్వేషిస్తూ పరమార్ధం పొందడానికై నిజాయితీగా కృషి చేస్తూనే ఉండాలన్నారు. ప్రతి వ్యక్తి తన జన్మకు కారణాన్ని తెలుసుకోగలిగితే భూలోకంలోనే స్వర్గానుభూతిని పొందగలుగుతారని, దేనికోసమో వెంపర్లాడే దుస్థితి దరిదాపులోకి కూడా రాదని యోగానంద్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం జివై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన, నేత్ర పరీక్ష, ఉచిత వైద్య శిబిరాలకు హాజరై యోగానంద చేతుల మీదుగా ఆయా సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. చందానగర్ డివిజన్ పరిధి క్రిస్టల్ గార్డెన్ లో గజ్జల యోగానంద్ మిత్ర బృందం నేతృత్వంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొని జన్మదిన కేకును కట్ చేసి మిత్ర బృందం సభ్యులకు తినిపించారు. తన జన్మదినం రోజున అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, మున్ముందు ప్రజలకు మరింత సేవ చేయడానికి ఆ భగవంతుడు సహకరించాలని కోరుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గజల యోగానంద్ మిత్రమండలి ప్రతినిధులు, జివై ఫౌండేషన్ ప్రతినిధులుతదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
” ప్రతివ్యక్తి తనజీవిత సార్ధకతకై కృషి చేయాలి – బిజెపి నేత గజ్జల యోగానంద్”




