
ఆస్పత్రిలో తల్లీ బిడ్డలపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్..
హైదరాబాద్: కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనమిది… సుల్తాన్ బజార్‌లోని ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో ఉన్నట్టుండి ఓ సీలింగ్ ఫ్యాను ఊడిపడింది. ఈ ఘటనలో నాలుగు రోజుల పసిబిడ్డ, అతడి తల్లి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే…
పి. మమత అనే మహిళ నాలుగు రోజుల క్రితం ప్రసవించింది. తల్లీ బిడ్డలిద్దరూ బెడ్‌మీద పడుకోగా మమత తల్లి వారి పక్కనే కింద పడుకున్నారు. రాత్రి 3:30 గంటల సమయంలో వారు నిద్రిస్తున్న రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్ ఉన్నట్టుండి ఊడిపడింది. నేరుగా అనుసూయపై పడగా, పక్కనే ఉన్న మమతకు రెక్కలు తగిలాయి. పైకి గాయాలు కాకపోయినప్పటికీ తల్లి అనసూయకు ఉదయం వరకు వాంతులు అయినట్టు మమత పేర్కొంది. దీంతో మెదడుకు దెబ్బ తగిలిందేమోనని వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా గత మూడు రోజుల నుంచి ఫ్యాన్ సరిగా తిరగకపోవడం, విపరీతంగా శబ్ధం చేస్తుండడంతో… దానిని ఆఫ్ చేసి ఉంచారు. ఆఫ్ చేసి ఉన్నప్పటికీ ఫ్యాన్ ఊడిపడడం గమనార్హం. అయితే తాము పలుమార్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆస్పత్రి సిబ్బంది పేర్కొన్నారు.




